సిబిఐ మాజీ జెడి వి.వి.లక్ష్మినారాయణ గారిని ఇటీవల నేను వివరంగా ఇంటర్వ్యూ చేశాను. ఆ క్రమంలో సహజంగా టాప్ కాప్ వుచ్ క్యాప్ అన్న ప్రశ్న వచ్చింది. కాప్ అంటే సివిలియన్ ఆన్ పెట్రోల్ అని ఆయన వివరించారు. ఇంతకూ తన భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ ప్రవేశం గురించి అడిగినపుడు ఇప్పటి వరకూ ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి మాత్రమే తనను సంప్రదించాయని చెప్పారు. జనసేన కూడా మాట్టాడినట్టు చెబుతున్నారు కదా అంటే అలా అనుకుంటున్నారు గాని వారెవరూ నన్ను సంప్రదించలేదని స్పష్టంగా చెప్పారు. అదే మేము పోస్టు చేశాము. ఆ తర్వాత జనసేనకు సంబంధించిన నాయకులొకరు ఫోన్ చేశారు. అసలు ఆయన రాజీనామా చేసి వస్తున్నట్టు తెలియగానే ముందుగా ట్వీట్ ద్వారా అభినందించింది పవన్ కళ్యాణేనని ఆ నాయకుడు గుర్తు చేశారు. తర్వాత కూడా తనతో టచ్‌లో వున్నట్టు చెప్పారు. మరైతే లక్ష్మీనారాయణ అలా ఎందుకు చెప్పారని తెలుసుకునే ప్రయత్నం కొంత చేశాను గాని ఇప్పటికేం లేదు. ఆప్, బిజెపిలలో ఏదో ఒకటి ఎంచుకోవడంతో పాటు స్వంతంగా తనే ఒక రాజకీయ పార్టీ స్థాపించే అవకాశం కూడా వుందని ఆయన ఇంటర్వ్యూలో సూచించారు. బిజెపిలో చేరడానికి మీకు సైద్దాంతిక అభ్యంతరాలేమీ లేవా అంటే అలాటివేమీ లేవని ఓపెన్‌గా వున్నానని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో వచ్చిన అసహనం గోరక్షణ పేరిట హత్యలు వంటివి దృష్టికి తెస్తే ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటివి కూడా చూడాలని అన్నారు. ఆరెస్సెస్ రాజకీయ పార్టీ కాదనీ అన్నారు. అయితే ఒక్కటే వైరుధ్యం కనిపించింది. ఎపికి ప్రత్యేక హోదా, సహాయం తప్పక అవసరమన్నారు. కాని అవన్నీ నిరాకరించింది బిజెపినే. ఈ మధ్య 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో ా బిజెపి ఒక్కటే ప్రత్యేక హోదా అక్కర్లేదని కూడా చెప్పింది. మరి ఆయన ఆకాంక్షకు ఆ పార్టీలోచేరికకు ఎలా పొసుగుతుందనేది ఒక ప్రశ్న. తనకు భవిష్యత్‌పై పూర్తి క్లారిటీ వుందంటున్న లక్ష్మీనారాయణ కొత్త ప్రయోగం గనక అన్నీ సమకూర్చుకోవడానికి సమయం పడుతుందని కూడా అన్నారు. ఆ ప్రకారం చూస్తే కొత్త పార్టీ అనుకోవచ్చు. తనను సంప్రదించని పార్టీలలో కూడా చేరే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చలేదు. అందుకే మొత్తంపైన చూస్తే అందరికీ అస్పష్టంగా అనిపిస్తున్నా ఆయన స్పష్టమైన ప్రణాళికవేసుకునే వున్నారన్నమాట.