తెలంగాణ మహాకూటమిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా.. సీపీఐ అస్సలు తగ్గడం లేదు. కనీసం ఐదు అసెంబ్లీ సీట్లు కావాల్సిందేనని పట్టుబడుతోంది. పార్క్ హయత్ లో మహాకూటమి నేతలు సమావేశంలో సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి.. తన డిమాండ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ తలోగ్గేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నామని ప్రకటించారు. ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్ ముందు ప్రతిపాదించామని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారని మీడియాకు చాడ వెంకటరెడ్డి చెప్పారు. వాళ్ల సమాధానాన్ని బట్టి మా నిర్ణయం ఉంటుందని బాల్ కాంగ్రెస్ కోర్టులోనే వేశారు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిజానికి మహాకూటమిలో సీట్లు, స్థానాలపై.. మొదట.. తెలంగాణ జన సమితి తీవ్ర అసంతృప్తిలో ఉంది. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత.. కోదండరాం కాస్త మెత్తబడ్డారు. మొదట్లో మూడు, నాలుగు సీట్లు అంటూ.. ఇచ్చిన లీకులతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. కనీసం పదిహేడు స్థానాల దగ్గర్నుంచి ప్రారంభించారు. చివరికి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలంటూ….లీకులిచ్చింది. ఆ స్థానాలేమిటో కూడా… ప్రకటించింది. దాంతో కోదండరాం కాస్త సంతృప్తి వ్యక్తం చేశారు. టీజేఎస్ లో.. తనతో పాటు.. జేఏసీలో కీలకంగా పని చేసిన కొంత మంది.. టిక్కెట్లకు ఇబ్బంది లేకపోవడంతో.. ఆయన సంతృప్తి చెందారు. పైగా తనకు జనగాం లాంటి చోట పోటీకి అవకాశం దక్కుతూంటే… దాదాపుగా సరే అన్నారు. ఆయన సైలెంట్ గానే ఉన్నారు. కానీ సీపీఐ మాత్రం అసలు శాటిస్ ఫై కావడం లేదు.
తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో నింపాదిగా ఉంది. ఏ సీట్లు.. ఎవరు అభ్యర్థులన్న విషయం.. ఇసుమంత కూడా టెన్షన్ పడటం లేదు. టీడీపీ తీరు చూస్తే… తమకు కావాల్సిన సీట్లు తాము తీసుకోవడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. అసలు టీడీపీకి ఏ సీట్లు కేటాయిస్తున్నారో కూడా.. ఇంత వరకూ స్పష్టత లేదు. అయినా టీ టీడీపీ నేతలు మాత్రం బిందాస్ గానే ఉన్నారు. పధ్నాలుగు సీట్లు అని కాంగ్రెస్ ఖరారు చేసిన తర్వాత … గట్టిగా.. ఎవరూ… కూడా.. తమకు సీట్లు పెంచాలని అడిగిన ప్రయత్నం చేయలేదు. తీరు చూస్తూంటే… కాంగ్రెస్ ను గెలిపించడానికి తాము పూర్తిగా త్యాగమైపోయినా పర్వాలేదన్నట్లుగా టీ టీడీపీ నేతల తీరు ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.