రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్లో ప్రారంభం కానుంది. ఈ ప్రారంభానికి ‘బాహుబలి’ ప్రభాస్ ముఖ్య అతిథిగా, ‘బాహుబలి’లో ప్రతినాయకుడిగా నటించిన రానా దగ్గుబాటి రావడం ఖాయమని తెలిసింది. అలాగే, రాజమౌళి దర్శకత్వంలో నటించిన యువ హీరోలు అతిథులుగా వస్తారని టాక్. ఎవరు వచ్చేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ప్రారంభానికి మీడియాను దూరంగా ఉంచుతున్నారు. కేవలం యూనిట్ సభ్యులు తప్ప మిగతావాళ్లు ఎవరూ వద్దనే ఆదేశాలు వుండటంతో మీడియాకి ఆహ్వానాలు రాలేదు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ సినిమాలు… రామ్చరణ్ ‘మగధీర’ సినిమా చేశారు. వీరిద్దరూ మల్టీస్టారర్ చేయడం… రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, ప్రభాస్ తప్ప నటించిన మరో హీరో ( రామ్చరణ్) రెండోసారి రాజమౌళి దర్శకత్వం సినిమా చేస్తుండటం కూడా ఇదే తొలిసారి. శుక్రవారం వరకూ రామ్చరణ్ ‘వినయ విధేయ రామ’ షూటింగ్ చేశారు. రేపటి నుంచి కొన్ని రోజులు ‘ఆర్ఆర్ఆర్’కు కేటాయించారు. మధ్యలో బ్రేక్ తీసుకుని ‘వినయ విధేయ రామ’ కంప్లీట్ చేస్తారు.