చూస్తుంటే.. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’పై రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నాడనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రవితేజ ఉత్సాహం, నమ్మకం, స్పీచ్ ఇచ్చిన విధానం చూస్తుంటే ఈసారి పక్కాగా హిట్ కొడుతున్నాడేమో అనిపిస్తోంది. దానికి తగ్గట్టు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ని తన హిట్ సినిమాలతో పోల్చి చూశాడు రవితేజ. వెంకీ, దుబాయ్ శీను కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని తన అభిమానులకు కిక్ ఇచ్చే మాట చెప్పాడు.
శ్రీనుతో తీసిన నీ కోసం ఎమోషనల్గా సాగిందని, ఆ తరవాత వచ్చిన వెంకీ, దుబాయ్ శీను బాగా నవ్వించాయని, ఆరెండింటిలో ఉన్న వినోదం ఈ సినిమాలో ఉంటుందని చెప్పాడు రవితేజ. తనతో పాటు సునీల్, వెన్నెల కిషోర్, సత్య, రఘుబాబులు చేసిన కామెడీ చాలా బాగా వచ్చిందని, వాళ్ల కామెడీ చూసి తాను బాగా ఎంజాయ్ చేశానని చెప్పాడు. ”సెట్లో బాగా ఎంజాయ్ చేశాను. మేం పనిచేస్తూ నవ్వుకున్నాం. మీరు తెరపై మమ్మల్ని చూసి అంతకంటే బాగా నవ్వుకుంటారు. శ్రీనువైట్లలో మంచి నటుడున్నాడు. తను చెప్పినదాంట్లో సగం చేస్తే చాలు. తెరపై కనిపించే ప్రతీ నటుడిలోనూ శ్రీనువైట్లనే కనిపిస్తాడు. ఆఖరికి ఇలియానాలో కూడా” అంటూ చమత్కరించాడు రవితేజ. మైత్రీ మూవీస్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 16న విడుదల కాబోతోంది.