*పెద్దలకు పేదలకు మధ్య మరింత పెరగనున్న స్ధితిగతుల తేడా
*స్విస్ బ్యాంక్ నివేదిక – పెట్టుబడులపై చర్చలకు భూమిక
*ప్రపంచ పోటీలో మన వ్యవసాయ దిగుబడుల చోటెక్కడ
నాలుగో పారిశ్రామిక విప్లవం (మొదటిది పారిశ్రామిక విప్లవం, రెండవది విద్యుత్‌చ్ఛక్తి విప్లవం, మూడవది ఎలక్ట్రానిక్ విప్లవం) నుంచి వచ్చిన రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాల వినియోగం ఆర్ధిక అసమానతల్నీ అంతకుమించి మధ్యవయసువారికి, యువతరానికీ మధ్య పోటీని పెంచుతాయని యు బి ఎస్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్ లాండ్) ఒక నివేదికలో సూచించింది. ఏటా ‘దావోస్’ లో జరిగే ప్రపంచ ఆర్ధిక ఫోరమ్ (డబ్లుఇఎఫ్) సదస్సు కోసం యు బి ఎస్ నివేదికలు రూపొందిస్తుంది.
దేశదేశాల అధినేతలు, ఆర్ధిక మంత్రులు, ఆర్ధిక నిపుణులు, సమాజాన్ని ప్రభావితం చేయగల కళాకారులు, యాక్టర్లు, సెలబ్రెటీలు…ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో ఉన్నత స్ధాయి వర్గాల వారు లేదా ”ఎలైట్” కి పరిమితమైన దావోస్ సమావేశంలో చర్చలకు, దశాదిశల మార్గదర్శనానికి ఈ నివేదికే పెద్ద ప్రాతిపదిక అవుతుంది. స్విట్జర్ లాండ్ లోని వింటర్ స్పోర్ట్స్ జరిగే ప్రదేశాలలో ఒక గ్రామమైన ”దావోస్” లో 1970 నుంచీ ఏటా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రవేశాన్ని ప్రస్తుతం 2600 మందికి పరిమితం చేశారు. ఎంట్రీ ఫీజు 20 వేల అమెరికన్ డాలర్లు.
ప్రపంచ ధోరణులను ఫాక్ట్ షీట్ల ద్వారా విశ్లేషించే ఈ సమావేశం కార్పొరేట్లకు ఇన్వెస్ట్ మెంట్ల అవకాశాలు తెలుసుకోడానికి ప్రధానవేదికలు అవుతున్నాయి. ఆయాదేశాలు పేదల జీవన ప్రమాణాలను ఎంత మెరుగుదల చేసినా ఆర్ధిక అసమానతలు తప్పడం లేదు. ఈ అసమానతల రూపాలు, పర్యావసానాలు, నివారణా చర్యలను కూడా యు బి ఎస్ తన నివేదికల్లో వివరిస్తుంది. ఈ ప్రకారం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సుల కు మంచి ఇన్వెస్ట్ మెంటు అవకాశాలు వున్నాయి. ఈ టెక్నాలజీని కొనగలవాళ్ళు లేదా వినియోగించకోగల వారి స్ధితిగతులు త్వరితంగా మెరుగై ఆ అవకాశం లేని పేదలు అలాగే వుండిపోతారు. ఫలితంగా నాలుగో విప్లవం కూడా సమాజంలో ఆర్ధిక వ్యత్యాసాలను పెంచేదిగానే వుంటుంది. ఇంతేకాకుండా మానవవనరుల్లో కూడా ఈ టెక్నాలజీ పోటిని పెంచుతుంది. యువతరం పెద్దతరం రెండుగా విడిపోతుంది.
జనవరి 23 వరకూ మూడురోజులు దావోస్ లో జరిగిన 46 వవార్షిక ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు 40 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అరుణ్‌జైట్లీ సారధ్యంలో భారతదేశం నుంచి 100మందికిపైగా పాల్గొన్న ప్రతినిధి వర్గంలో ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్; ఇంధనమంత్రి గోయల్, వ్యాపార వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్, జయంత్ సిన్హా, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు దేశ పారిశ్రామిక దిగ్గజాలైన ముఖేష్ అనిల్అంబానీలు, సైరస్ మిస్రీ, ఆనంద్ మహీంద్రా, రాహుల్ బజాజ్, అజీమ్ ప్రేమ్‌జీ, ఆదీ గోద్రెజ్, చందా కొచ్చర్, ఉదరు కొటక్, హరి ఎస్ భాటియా, నరేష్ గోయల్, మిట్టల్ మొదలైన వారు వున్నారు.
పరస్పరం అవకాశాలను తెలుసుకునే దావోస్ సదస్సు నుంచి వచ్చిన వెంటనే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ”ఇకమీదట గ్లోబల్ నెట్వర్క్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయతలపెట్టినట్లు వెల్లడించారు. విదేశాల్లో రైతులకు ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో వస్తున్న పంటల దిగుబడులను తట్టుకుని, సబ్సిడీలులేని భారతదేశ రైతాంగం విదేశీమార్కెట్‌లో నిలవగలదా..??? ఏమో!!!