ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం ఆదివారం ఉదయం జరుగుతుంది. నక్సల్స్ కాల్పుల్లో మరణించిన అరుకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు కుమారుడు కిడారు శ్రవణ్ కు మంత్రి పదవి ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రవణ్ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే, తండ్రి మరణం తరువాత ఏర్పడ్డ అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానంటూ శ్రవణ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాజకీయంగా తండ్రి లేని స్థానాన్ని భర్తీ చేయాలంటూ కూడా కోరారు. ప్రస్తుతం శాసన మండలి ఛైర్మన్ గా ఉన్న ఫరూక్ కి కూడా కేబినెట్ లో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరితో ప్రమాణం చేయించేందుకు గవర్నర్ నర్సింహన్ అమరావతి వస్తున్నారు.
అయితే, ఆయన పర్యటనలో చిన్న మార్పు ఇక్కడ గమనించాలి! వాస్తవానికి, శనివారం సాయంత్రమే గవర్నర్ నర్సింహన్ విజయవాడ చేరుకోవాల్సి ఉంది. ఒకవేళ అలా వచ్చి ఉంటే, మర్యాదపూర్వంగా ఆయన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుకోవాల్సి ఉంటుంది. కారణం ఇదో ఏదో ఏమో తెలీదుగానీ… గవర్నర్ తన ప్లాన్ మార్చుకుని, ఆదివారం ఉదయం అమరావతికి బయల్దేరి వస్తున్నారు. అంతేకాదు, ఆదివారం ఉదయం గవర్నర్ ను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లడం లేదట! మంత్రి దేవినేని ఉమా మహాశ్వరరావు వెళ్తున్నట్టు సమాచారం. అక్కణ్నుంచి గవర్నర్ నేరుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికే వస్తారు. కొత్త మంత్రులతో ప్రమాణం అనంతరం వేరే ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా… ఆ వేదిక నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోతారు. ముఖ్యమంత్రి, గవర్నర్లు కేవలం వేదిక మీద మాత్రమే కలుస్తారన్నమాట! అంటే, ఈ ఇద్దరూ భేటీ అయ్యేందుకు ఎక్కడా ఆస్కారం లేదన్నమాట.
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తి దాడి ఘటన అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రులు కలుస్తుండటంతో కొంత ఆసక్తి నెలకొంది. కానీ, కారణలేవో తెలీదుగా గవర్నర్ అమరావతి రాక షెడ్యూల్ లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. అమరావతిలో కనీసం ఒక్కరోజు కూడా ఉండేట్టుగా ఆయన పర్యటన లేకపోవడం ఇక్కడ గమనార్హం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే ఈ మార్పునకు కారణం అనేవారూ లేకపోలేదు! ఈ మార్పు వెనక కారణాలు గవర్నర్ వివరించే అవకాశాలు ఉండవనే అనిపిస్తోంది.