గత కొద్ది రోజులుగా ఎపి ముఖ్యమంత్రి చంద్ర బాబు రాజకీయంగా చాలా చురుగ్గా ఉంటున్నారు. బెంగుళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటి నిర్వహించారు. చంద్రబాబు ఈ వారంలోనే డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేలా కార్యచరణను సిద్దంచేసుకున్నారు. చంద్రబాబు- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాయావతి, శరద్‌పవార్, శరద్ యాదవ్,ములాయం, అఖిలేష్, ఫరూఖ్ అబ్దుల్లా, వంటి నేతలతో ఇదివరకే భేటీలు నిర్వహించి ఉన్నారు. ఇదంతా చంద్ర బాబు రాజకీయం. అయితే ఈ సందర్భంగా మీడియా చేస్తున్న మాయాజాలం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.
మీడియా ప్రెజెంటేషన్ ఎలా ఉంది?
“భాజపాయేతర శక్తులను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా” ముఖ్యమంత్రి చంద్రబాబు భాజపా వ్యతిరేక పక్షాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిజేపియేతర శక్తులన్నీ సంఘటితం చేసి, ఆ శక్తులను ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు చంద్రబాబు. కూటమి ఏర్పాటు కోసం చురుగ్గా కృషి చేస్తున్నారు చంద్రబాబు. ఇదీ తెలుగు అగ్ర మీడియాల్లో కథనాలు, ఛానెళ్ళలో స్క్రోలింగ్స్ వస్తున్న తీరు. మామూలు గా చూస్తే ఇందులో తేడా ఏమీ కనిపించకపోవచ్చు కానీ, నిశితంగా పరిశీలిస్తే ఇక్కడే మన మీడియా మాయాజాలం కనిపిస్తుంది. ఇక్కడ మూడు ప్రశ్నలున్నాయి.
మొదటిది – ఇది బిజేపియేతర కూటమా? కాంగ్రెస్ కూటమా?
భారత దేశ రాజకీయాల్లో ఎప్పుడూ రెండు కూటములు ఉంటాయి. అందులో ఒకదానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తే మరొక దానికి బిజెపి నాయకత్వం వహిస్తూ ఉంటుంది. అడపాదడపా ఈ రెండూ కాకుండా మూడో ఫ్రంట్ , నేను కూడా ఉన్నాను అంటూ గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ లెక్కన ఇప్పుడు చంద్రబాబు రాహుల్ గాంధీ తో కలిసిన తర్వాత కాంగ్రెస్ కూటమి లోనికి వెళ్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. అయితే అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు మన మీడియా కానీ ఎక్కడా కూడా దీన్ని కాంగ్రెస్ కూటమి లాగా పరిగణించడంలేదు, కాంగ్రెస్ కూటమి అంటూ రాయడం లేదు. ఇది కూడా మన మీడియా మాయాజాలం లో భాగమే. ఎందుకంటే కాంగ్రెస్ కూటమి అంటూ హెడ్డింగ్ పెట్టినా, యూపీఏ లోకి తెలుగుదేశం అంటూ వ్యాఖ్యానం చేసినా, ప్రజలలో అప్పటి యూపీఏ స్కాములు, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిన తీరు ప్రస్ఫుటంగా స్ఫురణకు వస్తుంది. కాబట్టి దీన్ని కాంగ్రెస్ కూటమి లేదా యూపీఏ కూటమి అని సంబోధించకుండా, బీజేపీయేతర కూటమి అంటూ ఇటు చంద్రబాబు అటు మీడియా తమదైన శైలిలో మాయాజాలం చేస్తున్నాయి.
రెండవది- ఏక తాటిపైకి వారిని తెస్తున్నారా? వారి తాటి మీదకి తానెక్కుతున్నారా?
ఇక రెండవది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ అన్నింటిలోను ప్రతిరోజు, ప్రముఖంగా వచ్చే స్క్రోలింగ్ ఏమిటంటే, బిజెపియేతర పక్షాలన్నింటినీ, చంద్రబాబు ఏకతాటిమీదకు తీసుకుని వస్తున్నాడని. అయితే సరిగ్గా గమనిస్తే, ఇది కూడా మీడియా మాయాజాలం అని అర్థమవుతుంది. చంద్రబాబు బెంగుళూరు వెళ్లి కుమారస్వామిని కలిసి వచ్చాడు. ఆయన ఇదివరకే కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజే, జెడిఎస్ యూపీఏలో భాగస్వామిగా ఉంటుంది అని అటు కాంగ్రెస్ నేతలు ఇటు జెడిఎస్ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత స్టాలిన్ తో చంద్రబాబు భేటీ అవుతున్నారు. స్టాలిన్, ఆయన డీఎంకే పార్టీ, యూపీఏ లో ఒక దశాబ్దం పాటు భాగస్వామిగా ఉన్నారు. అలాగే చంద్రబాబు కలుస్తున్న ఇతర నాయకులు కూడా, ఇదివరకే యూపీఏ కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపిన వారే. వీరందరితో చంద్రబాబు భేటీ కావడం అంటే, దానర్థం ఇదివరకే వారందరూ ఉన్న యూపీఏ అనే తాటి మీదకు చంద్రబాబు కూడా ఇప్పుడిప్పుడే ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు అని. అంతేకానీ తెలుగు మీడియా చెప్తున్నట్టు వారిని చంద్రబాబు కొత్తగా ఏకతాటి మీదకు తీసుకు వస్తున్నది ఏమీ లేదు.
మూడవది- కత్తితో పొడిచి గాయం చేయడం పెద్ద నేరమా? గాయానికి మందు రాయకపోవడం పెద్ద నేరమా?
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి, ఇవ్వకపోవడం బిజెపి చేసిన పెద్ద తప్పిదం. ఒకవేళ కచ్చితంగా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఏ మోడీ అయితే హామీ ఇచ్చాడో, అదే మోడీ పూర్తిస్థాయి వివరణ ఇచ్చి, ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు అన్న దానిపై సమగ్రంగా ప్రజలకు వివరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అలా చేయకపోవడం వల్ల తెలుగు ప్రజలలో ఇటు బిజెపి అటు మోడీ మీద వ్యతిరేకత పెరిగింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎన్ డి ఏ లోంచి బయటికి వచ్చిందో, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లో కూడా, బిజెపి మీద వ్యతిరేకత ప్రదర్శిస్తూ తీవ్ర కథనాలు రావడం పెరిగింది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ మీద నెమ్మది నెమ్మదిగా సానుకూల వ్యాఖ్యానాలతో, కథనాలు మొదలయ్యాయి. రాష్ట్రాన్ని విడగొట్టడం కత్తి తో చేసిన గాయం లాంటిది అయితే, ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం ఆ గాయానికి మందు పూస్తానని చెప్పి పూయకపోవడం లాంటిది. ఈ రెండింటిలో ఏది పెద్ద నేరమో ప్రజలకు తెలియనిది కాదు. అయితే ప్రజలకు తెలిసిన ఆ వాస్తవాన్ని మార్చడానికి చేస్తున్న ఒక ప్రయత్నం ఈ మీడియా మాయాజాలం.
మొత్తం మీద:
రాజకీయ పార్టీలు అన్నాక రాజకీయమే చేస్తాయి. అందులో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. కానీ మీడియా సంస్థలు సైతం రాజకీయ పార్టీలతో పోటీపడి రాజకీయం చేయడం, మాయాజాలం చేయడం కచ్చితంగా ప్రశ్నించి తీరవలసిన అంశం, ప్రజలకు అవగాహన కల్పించవలసిన అంశం.
– జురాన్ (@CriticZuran)