మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ తీరుపై సీపీఐ తీవ్ర అసంతృప్తిని, అలకను ప్రదర్శిస్తోంది. శనివారం అంతా కూటమి నేతలతో కాంగ్రెస్ నేతల రాయబారాలతోనే గడిచింది. ముందుగా ఓ హోటల్లో ఎల్.రమణ, చాడ వెంకటరెడ్డి, కోదండరామ్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్ వ్యవహారశైలిపై చర్చించారు. ఇదే సమయంలో కోదండరామ్‌తో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, కుంతియాతో భేటీ అయ్యారు. అయితే ఈ చర్చల్లో ఎలాంటి హామీ రాలేదు. పొత్తుల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని.. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కూటమిని ఏర్పాటు చేశామని ఎల్. రమణ చెప్పుకొచ్చారు కానీ.. ఎవరూ ఇవ్వడం లేదు..! తీసుకోవడానికి ఎవరికీ అవకాశం రావడం లేదు..!
సీట్ల సర్దుబాటు విషయంలో పట్టువిడుపుగా ఉండాలని సీపీఐ భావిస్తున్నా.. ఐదు సీట్లయినా కావాలని గట్టిగానే పట్టుబడుతున్నారు చాడ వెంకటరెడ్డి. మూడు సీట్లేనంటూ ఢిల్లీలో ఏకపక్షంగా సీట్లు ప్రకటించడంపై అసంతృప్తిలో చాడ ఉన్నారు. అయితే కూటమి నుంచి బయటకు వెళ్లేదిలేదని తెగేసి చెబుతున్నారు. కనీసం నాలుగు సీట్లయినా ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నారు. హుస్నాబాద్ సీటు కోసం… చాడ వెంకటరెడ్డి.. కాంగ్రెస్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నా… ఇతర సీట్ల విషయంలో సైలెంట్ గా ఉంటున్నారని… ఇతర సీపీఐ నేతలు.. గుర్రుగా ఉన్నారు. కొత్తగూడెం సీటును ఆశిస్తున్న కూనంనేని సాంబశివరావు ఈ విషయంలో చాడ వెంకటరెడ్డిపై.. ఫైర్ అవుతున్నారు. దీంతో చాడపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.
మొత్తానికి కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ రాకున్నా.. అభ్యర్థుల ప్రకటనకు ముందు చివరిసారి ప్రయత్నం చేసి.. తర్వాత నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది సీపీఐ. అటు కోదండరామ్ టీజేఎస్ కు కేటాయించబోయే సీట్ల విషయాన్ని కూడా మరోసారి కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లారు. ఏం చేసినా…ఈ సమయంలో.. ఎవరూ కూటమి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తే.. అన్ని సీట్లలో పోటీ చేసి… రేసులో నిలబడాల్సిందే తప్ప.. అంతకు మించిన చాయిస్.. మిత్రపక్షాలకు లేదని… కాంగ్రెస్ లోని కొంత మంది సీనియర్లు బయటకే చెబుతున్నారు.