భానుమతి, విజయనిర్మల, సావిత్రి, శ్రీప్రియ, జీవితా రాజశేఖర్… దర్శకులుగా మారిన కథానాయికల జాబితా తీస్తే ఈ ఐదుగురితో పాటు మరో ఇద్దరు ముగ్గురు పేర్లు బయటకు వస్తాయేమో! తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకుల సంఖ్య తక్కువ. అందులోనూ దర్శకులుగా మారిన కథానాయికల సంఖ్య మరీ తక్కువ. ఈతరం కథానాయికల్లో అయితే దర్శకత్వం మీద ఆసక్తి చూపించేవారి సంఖ్య బహు తక్కువ. ఆ తక్కువలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. ‘అ ఆ’, ‘ప్రేమమ్’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో నటించిన ఈ మలయాళ ముద్దుగుమ్మకు దర్శకత్వం అంటే తనకు ఆసక్తి అని చెప్పుకొచ్చింది.
అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ “కెమెరా ముందు కంటే కెమెరా వెనుక వుండటం నాకెంతో ఇష్టం. దర్శకురాలు కావాలనేది నా కల. మణిరత్నంగారు ఫ్రేమ్ ఎక్కడపెట్టినా అందంగా వుంటుంది. ఆయనలా అందమైన విజువల్స్ క్యాప్చర్ చేయాలనేది నా కల. నా దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ వున్నాయి. వాటిని కథలుగా మలచాలి. త్రివిక్రమ్ గారితో సహా నేను పనిచేసిన దర్శకుల్లో కొంతమందిని మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇవ్వమని అడిగా. త్రివిక్రమ్ గారు ఇస్తానని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి తరవాత డైరెక్టర్ అవుతా. ఎప్పుడు దర్శకురాలు అవుతానో చెప్పలేను. కానీ, అవుతా. అందుకు కొన్నేళ్ల సమయం పట్టవచ్చు” అన్నారు. ప్రస్తుతానికి అనుపమా పరమేశ్వరన్ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారు. కొన్నేళ్ల తరవాత దర్శకురాలిగా మారతారన్నమాట!!