విశాఖపట్నం ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్పై జరిగిన దాడి ఘటన..ఒక పునర్జన్మ అని… వైఎస్ విజయమ్మ అన్నారు. గొంతులో దిగాల్సిన కత్తి ఆయన చేతికి తగిలింది కాబట్టి ప్రాణపాయం నుంచి దేవుని దయవల్ల.. ప్రజలందరి ఆశీస్సుల వల్ల జగన్ తప్పించుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నామన్నారు. ఈ కేసు వ్యవహారం ఇంకా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉందని విమర్శించారు. జగన్ పాదయాత్రను ఆపేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. గుంటూరు, గోదావరి జిల్లాలో జగన్ను అంతం చేయడానికి రెక్కీ నిర్వహించారని విజయమ్మ ఆరోపించారు. జనం మధ్య వైఎస్ జగన్ను ఏం చేయలేరని జనంలేని ఎయిర్పోర్టులో దాడిచేశారన్నారు.
ప్రతి పక్షాలకు సెక్యురిటి లేకపోతే ఇంకా అధికార ప్రభుత్వానికి ఎలా సెక్యురిటి ఉంటుందని విజయమ్మ ప్రశ్నించారు. డీజీపీపైనా విజయమ్మ విమర్శలు గుప్పించారు. డీజీపీ .మాట్లాడిన తిరు, చంద్రబాబు మాట్లాడిన తీరు బాగోలేదన్నారు. ధర్డ్ పార్టీ విచారణ చేయించడానికి చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. జగన్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని హైదరాబాద్ వస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారని విమర్శించారు. దాడి తర్వాత కూడా తమ కుటుంబాన్ని తీవ్రంగా అవమానిస్తున్నారు. ఒక తల్లి మీద, చెల్లి మీద, ఒక భార్యపై కూడా మాట్లాడుతున్నార విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ భరిస్తున్నాం.. అన్నీ సహిస్తున్నాం. ఎన్ని కష్టాలెదురైనా ఎక్కడా తలదించేదిలేదన్నారు. రాజశేఖరరెడ్డిని ఒక నాయకుడిగా ప్రజలు గుర్తించి.. 30 ఏళ్లపాటు వారి భుజస్కందాలపై మోశారని… వైఎస్ కుటుంబాన్ని ఆదరించిన, ఎంతగానో ప్రేమించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామన్నారు. వైఎస్ మరణించిన తర్వాత తాను ఒంటరిని కాను.. తనకు ప్రజలంతా తోడున్నారని వైఎస్ జగన్ ఎప్పుడు చెబుతుంటారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. నా కుమారుడ్ని మీ చేతుల్లో పెడుతున్నా.. అని వైసీపీ మొదటి ప్లీనరి సమావేశంలోనే చెప్పానని విజయమ్మ గుర్తు చేశారు. జగన్ ఏడేళ్లలో.. ఎక్కువగా ప్రజల్లోనే గడిపారని.. కుటుంబంతో కూడా గడపలేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయమ్మ విమర్శలు చేశారు. వ్యవస్థల్లో వారి మనుషులను పెట్టుకుని.. తొమ్మిదేళ్ల తర్వాత వైఎస్ భారతీని ఈడీ కేసులో ఇరికించాలని ఎన్నో ప్రయత్నాలు చేయడాన్ని చూస్తున్నామన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్ దేనికీ చలించలేదు.. దేనికి చెక్కుచెదరలేదన్నారు. నియంతృత్వ కాంగ్రెస్, వికృత టీడీపీతో కలిసి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల పాటు.. కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తే.. ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు.