మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డిని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి… ఈ రోజు మధ్యాహ్నం వరకూ… అంబిడెంట్ కంపెనీ నుంచి తీసుకున్న లంచం, ఈడీ అధికారికి ఇచ్చిన రూ. కోటి వ్యవహారాలపై ప్రశ్నించిన తర్వాత.. అరెస్ట్ నిర్ణయాన్ని తీసుకున్నారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో పరీక్షల అనంతరం గాలి జనార్ధన్‌రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఒంటరిగా ప్రశ్నించిన సందర్భంలో ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని చెప్పిన గాలి.. ఫరిద్ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం తాను సాయం చేసినట్లు ఒప్పుకున్నట్లు కన్నడ మీడియా చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని కూడా పోలీసులు ప్రశ్నించారు. గాలి జనార్ధన్ రెడ్డి సూచన మేరకు రూ.18కోట్ల నగదును ఆర్టీజీఎస్ రూపంలో బదిలీ చేసేందుకు సహకరించిన బెంగుళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి బ్రిజేష్ రెడ్డి, ఫైజల్, జయరాంలను పోలీసులు ప్రశ్నించారు. కేసును దారి తప్పించేందుకు కుట్ర పన్నడం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన అభియోగంపై గాలిని అరెస్ట్ చేశారు.
కర్ణాటకలో యాంబిడెంట్ మార్కెంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ…గొలుసుకట్టు వ్యాపారంలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించింది. దాదాపుగా రూ. వెయ్యి కోట్లు ఇలా వసూలు చేసి చేతులెత్తేసింది. మనీ లాండరింగ్‌కు పాల్పడటంతో.. ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ యాంబిడెంట్ కంపెనీ.. గాలి జనార్దన్ రెడ్డి వద్దకు వచ్చింది. ఆయన ఈడీ కేసులు తీసేయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ప్రతిగా తనకు 57 కిలోల బంగారం. రూ. 2 కోట్లు నగదు కావాలన్నారు. ఆ ప్రకారం… యాంబిడెంట్ కంపెనీ ఎండీ ఫరీద్ గాలి పీఏ… అలీ ఖాన్ కు ఆ మొత్తం సర్దుబాటు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి ఈడీ అధికారులకు… రూ. కోటి లంచం ఇచ్చారు. అయితే.. ఇది బయటపడిపోయింది. ఈ విషయం సాక్ష్యాలతో సహా… యాంబిడెంట్ కంపెనీలో సోదాలు చేసిన అధికారులకు వీటికి సంబంధించిన ఆధారాలు దొరికాయి.
అక్రమ మైనింగ్‌తో వేల కోట్లు సంపాదించిన గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లారు. బెయిల్ కోసం న్యాయమూర్తికి లంచం ఇవ్వబోయి.. దొరికిపోయారు. ఆ కేసు కూడా.. కోర్టులో ఉంది. కొత్తగా ఈడీ అధికారులకు లంచం కేసు…నమోదయింది.