హీరో శివాజీ నాతో ఆపరేషన్ గరుడ ( లేదా ద్రవిడ ) గురించి ప్రస్తావించిన తర్వాత ఏడాదికి అమలు జరిగిందంటున్నారు. ఇంతకాలంలోనూ దాని గురించిన ఏ వివరాలు తెలుసుకోవడం లేదా నిలుపుచేయడం ఎపి పోలీసులు నిఘా విభాగం చేతకాలేదు. కనీసం ఆయనను పిలిచి మాట్లాడ్డమైనా వారు చేయలేకపోయారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మొదలు పెట్టి ఆయన మంత్రులు ముఖ్య నేతలు అందరూ దాన్ని భగవద్గీతలా వల్లె వేస్తూనే వున్నారు. నిజంగా ప్రభుత్వాన్ని ప్రజలను ప్రభావితంచేసే సమాచారం ఏదైనా వుంటే పోలీసులతో పంచుకోవలసిన శివాజీ కూడా ఆ పనిచేసింది లేదు. దీనిపై ఏదైనా సందేహం వుంటే నాతో ఇంటర్వ్యూలో తాజాగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. రాజకీయ ప్రచారం చేసుకోవడం తప్ప తమకు తెలిసింది చెప్పాలనే బాధ్యత శివాజీకీ చెప్పించే బాధ్యత ప్రభుత్వానికి లేకపోయింది. మహారాష్ట్ర కోర్టు వారంటు ఇస్తే ఇదే అన్నారు, ఐటి దాడులు జరిగితే ఇవే అన్నారు. మరి మీరు చెప్పే ప్రకారం జగన్ బలిపశువు కదా ఆయనపై కుట్ర ఆరోపణ ఎందుకు చేస్తున్నారంటే సమాధానం లేకపోయింది. ఈ ప్రశ్న అడిగింది కూడా నేను తప్ప వైసీపీకి టిడిపికి కూడా ఇష్టం లేకపోయింది.
పాత ఆపరేషన్ కథలతో పలచనైంది చాలక ఇప్పుడు ఆపరేషన్ గరుడ మరొక హడావుడి మొదలుపెట్టారు.ఈ సారి దర్శక నిర్మాత వ్యాఖ్యాత తమ్మారెడ్డి భరద్వాజ ముందుకొచ్చారు. టివి5లో మూర్తి చర్చకు పెట్టారు. పెద్దవారు పాత మిత్రులు గనక తమ్మారెడ్డిని లేదా మూర్తిని ఏమీ అనడం లేదు. కాని ప్రభుత్వం నిఘా విభాగం ఏం చేస్తున్నాయనే ప్రశ్న మళ్లీ అడగాల్సి వచ్చింది. గరుద పురాణం నడుస్తుండగానే సో కాల్డ్ ఆపరేషన్ బి ముంచుకొస్తుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? హైదరాబాదులో ఫిలిం నగర్లో వున్నవారికి తెలిసే మీకెందుకు తెలియడం లేదు? ఇది వైఫల్యమని ఒప్పుకుంటారా లేక బూటకమని కొట్టి పారేస్తారా? శివాజీ చెప్పలేదు గాని భరద్వాజ అయినా పోలీసులకు తన సమాచారం చేరుస్తారా? లేక టీవీ చర్చలతో ఆపేస్తారా? ఇప్పుడు కూడా మళ్లీ ఐటి దాడులనే అంఉన్నారు. అలాగైతే ఇది మరో ఆపరేషన్ ఎందుకైంది?గరుడ కొససాగింపు అనుకోవచ్చు కదా!
బిజెపి ఆరెస్సెస్‌లు అధికారం కోసం అవతలివారిని దెబ్బతీయడం కోసం పథకాలు పన్నడం మామూలే. కాని ఈ రెండు ఆపరేషన్లలోనూ ఐటి దాడులు తప్ప మరేమీ చెప్పడం లేదు. అందుకే దీన్ని టిడిపి వ్యాపారవేత్తలను సమర్తించేందుకు చేస్తున్న విఫలయత్నం అనొచ్చు. బిజెప ఆరెస్సెస్ మతతత్వ రాజకీయాలను కేంద్రీకృత పోకడలను ఎదుర్కొవాలంటే అది కట్టుకథలతో కుదిరేపని కాదు. రాజకీయ నిజాయితీతో నిశితంగా ఎదుర్కోవాలి.