ఒంటేరు ప్రతాపరెడ్డి మొదటి నుంచి కెసిఆర్‌ను ఢకొని నిలిచిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. టిడిపి నాయకత్వానికి పెద్ద ఆసక్తి లేకున్నా నిజంగానే వంటరిగా పునాది కాపాడుకున్నారు. తెలంగాణ అధినేత కెసిఆర్‌ను స్వంత నియోజకవర్గంలో తక్కువ మెజార్టితో బయిటపడే పరిస్థితి తీసుకొచ్చారు. వ్యక్తిగతంగానూ ఆయనపై పెద్ద వివాదాలు లేవు. స్వతహాగా రేవంత్ రెడ్డి మిత్రుడు గనక ఆయనతో పాటు కాంగ్రెస్‌లో చేరారు. జాబితా ఖరారు కాకున్నా తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే వుంది గాని ఇటీవల ఆయన కెసిఆర్‌ను ఓడించేందుకు తనకు హరీశ్ రావు సహాయం చేస్తానని చెప్పినట్టు ఆరోపించడం దుమారం రేపింది. నెంబరు లేని ఫోన్ నుంచి కాల్ చేశారనేది ఆయన వాదన. కాబట్టి నిరూపించడం కుదిరేపని కాదు. షరా మామూలుగా దీన్ని హరీశ్ వెంటనే ఖండించారు. తర్వాత టిడిపి నేత రేవూరి ప్రకాశరెడ్డి అదే కథ మరింత వివరంగా చెబితే ఆయన తీవ్రమైన భాషలో స్పందించారు. దానిపై ప్రతాపరెడ్డి, రేవంత్, రేవూరి ప్రకాశరెడ్డి వంటివారు కూడా అంతే తీవ్రంగా బదులిచ్చారు. ఈ రచ్చపై ఎన్నికల సంఘం నోటీసులు కూడా ఇచ్చింది. ఇక ఆ తర్వాత ప్రతాపరెడ్డి ఛానళ్లలో మరిన్ని వివరాలు వ్యాఖ్యలు మొదలుపెట్టారు. మరో సందర్భంలో మరెవరికో కూడా హరీష్ మద్దతు నిచ్చి కాంగ్రెస్లోచేరేందుకు ఢిల్తీ పంపించారని రేవంత్ వెల్లడించారు.
ఇక్కడ సమస్య ఏమంటే మొదటినుంచి రేవంత్ రెడ్డి హరీష్ రావుకూ కెసిఆర్‌కు మధ్య విభేదాల గురించి ఎక్కువగా చెబుతూ వస్తున్నారు. అదొక ప్రధానమైన ప్రచారాస్త్రంగా బావిస్తున్నారు. అయితే హరీష్ సర్దుకుంటున్నంత కాలం కెసిఆర్ ఇముడ్చుకున్నంత కాలం ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం శూన్యమే. పైగా దానివల్ల చర్చ దారి తప్పిపోతుంటుంది. ఆధారాలు చూపలేకున్నా ఏ ప్రమాణమైనా చేస్తానని సవాలు విసురుతున్నారు గాని దానికేమీ విలువ లేదు. ఇక ఎన్నికల్లో వొంటేరు తన గురించి కెసిఆర్ వైఫల్యాల గురించి గాక నిరూపించలేని ఈ ఆరోపణలపై సమయం వెచ్చించడం వల్ల వొరిగేది పూజ్యం. మరి ఆయనను ఈ వైపు దారి మళ్లించిన వారెవరో తెలియదు గాని ఆయన శ్రేయోభిలాషులై వుండరు.