హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ముమ్మరంగా పాల్గొంటూ ప్రత్యర్థులపై జోరుగా విమర్శనాస్తాలు సంధిస్తున్నారు. ప్రధానంగా కేటీఆర్ లక్ష్యంగా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తన తాత, తండ్రేనని, కేటీఆర్ తాత, తండ్రి కాదని కేటీఆర్‌కు గుర్తు చేస్తున్నారు. ఇవాళయితే మరో అడుగు ముందుకేసి, తాను పుట్టి పెరిగింది, చదువుకుంది హైదరాబాద్‌లోనేనని, కేటీఆర్ మాత్రం ఇక్కడ పుట్టి గుంటూరులో చదివాడంటూ కొత్త పాయింట్ లేవదీశారు. హైదరాబాద్‌కు తాను గెస్ట్ కాదని చెప్పారు. నగరానికి ఏమి చేశారో కేటీఆర్ చెప్పలేకపోతున్నారని, టీడీపీ-బీజేపీని గెలిపిస్తే 2017 జనవరి నాటికి మెట్రో రైల్‌ను పూర్తి చేసి చూపిస్తామని అన్నారు.
ఏది ఏమైనా చినబాబు మాట్లాడుతుంటే నాడు చిత్తూరు జిల్లాలో జరిగిన పొరపాటు మళ్ళీ జరుగుతుందేమోనని పార్టీలోని కొందరు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. నాడు చినబాబు పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, “అవినీతి, బంధుప్రీతి, కులపిచ్చి, మతపిచ్చి ఉన్నపార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే” అని అన్నారు. వెంటనే పక్కనే ఉన్న కార్యకర్త ఒకరు లోకేష్‌ను అప్రమత్తం చేశారు. లోకేష్ సర్దుకుని అవన్నీ లేని పార్టీ తెలుగుదేశం ఒక్కటేనని అన్నారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో చిత్తూరు జిల్లాలో కాబట్టి మీడియాలో పెద్దగా రాలేదుగానీ, సోషల్ మీడియాలో మాత్రం నాడు చినబాబును రచ్చరచ్చ చేశారు.