గవర్నర్ నరసింహన్ ను భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కలుసుకున్నారు. ఎందుకుంటే, రాష్ట్ర ప్రజల సొమ్మును సొంత ప్రచారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా వాడుకుంటున్నారనీ, దానిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ కి చెప్పామన్నారు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతుందో, గవర్నర్ కి కూడా అంతే ఉందన్నారు జీవీఎల్. ప్రజాధనాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే, సుప్రీం కోర్టు కూడా తప్పుబట్టిన సందర్భాలున్నాయన్నారు. తమ ఇమేజ్ బిల్డింగ్ కి ప్రజాధనం ఉపయోగించకూడదనీ, కానీ ఆంధ్రాలో రాజకీయ కార్యక్రమాలకు ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు అన్నారు.
ధర్మపోరాటం పేరుతో పెద్ద మొత్తంలో ప్రజలు సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారనీ, అది చాలదన్నట్టుగా రాజకీయ ప్రయాణాలకీ, రాజకీయ వ్యాపారాలకీ కూడా ముఖ్యమంత్రి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు జీవీఎల్! దేశంలోని అన్ని ప్రాంతాలకూ దేశదిమ్మరిగా తిరుగుతున్నారంటూ ముఖ్యమంత్రిని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తాము దీన్నొక ప్రజా ఉద్యమంలా తీసుకొస్తామనీ, ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయినీ తిరిగి ప్రభుత్వానికీ ప్రజలకూ చెల్లించేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు జీవీఎల్. ఈ సందర్భంగా అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చారండోయ్! నాయకులు మారిపోతూ ఉంటారనీ, కానీ వారి విచ్చలవిడి విన్యాసాలకు వత్తాసు పలికే అధికారులు తరువాత జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై కోర్టు వెళ్తామనీ, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామన్నారు జీవీఎల్. ఓడిపోయే పార్టీలన్నింటినీ వెంటా చంద్రబాబు వెళ్తున్నారనీ, ఎందుకో భయపడుతున్నారు కాబట్టే ఇలా పరుగులు తీస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనం ఖర్చు చేస్తున్న అంశంపై జీవీఎల్ మాట్లాడుతుంటే… గురివింద గింజ తన నలుపెరుగనట్టు అనే సామెత గుర్తొస్తోంది..! ప్రజాధనాన్ని రాజకీయ ప్రచారం కోసం భాజపా వాడుకున్నంతగా గతంలో ఎవరైనా వాడుకున్నారా..? అభివృద్ధి కార్యక్రమాల ముసుగు తొడిగి భాజపా చేసుకుంటున్న ప్రచారం ప్రజలకు అర్థం కానిదని జీవీఎల్ అనుకుంటే ఎలా..? ఒక రాష్ట్రానికి వరదలంటే సాయం కోసం డబ్బులు విడుదల చేయడానికి ఆలోచిస్తారు, ఒక రాష్ట్రం విభజనకు గురై అవస్థలు పడుతూ పునర్నిర్మాణం చేసుకుంటూ ఉంటే నిధులివ్వరు… ఎందుకంటే, వీటిలో భాజపా రాజకీయ ప్రయోజనాలు పెద్దగా కనిపించడం లేదు కాబట్టి! అదే, గుజరాత్ లో పటేల్ విగ్రహ నిర్మాణానికి వేల కోట్లు ఖర్చుపెట్టి, పనులు చకచకా చేయించి, ఇప్పుడు ఆ ఘనత తమదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి, ఇది ప్రజాధనంతో నిర్మాణమైంది కాదా..? రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కేంద్రాన్ని ప్రశ్నించలేని ఆ పార్టీ రాష్ట్ర నేతలు… రాష్ట్రంలో నిధుల ఖర్చు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక అర్హత ఎలా ఉంటుంది..?