ఇలియానా…
దేవదాస్ చూడగానే… ఈ పేరు, ఆ రూపం గుండెల్లో త్రీడీ ప్రింటు వేసుకుని మరీ దిగబడిపోయింది.
పోకిరి చూసి… ఫ్లాటైపోయారు.
అక్కడ్నుంచి సినిమా సినిమాకీ కిక్ ఇస్తూనే వచ్చింది. చూస్తుండగానే స్టార్ అయిపోయింది. మధ్యలో బాలీవుడ్ వైపు వెళ్లింది. అక్కడ్నించి తిరిగి రావడానికి ఆరేళ్లు పట్టింది. ఇలియానా కథానాయికగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా `అమర్ అక్బర్ ఆంటోనీ`. ఈనెల 16న విడుదల అవుతోంది. ఈసందర్భంగా ఇలియానాతో చిట్ చాట్.
* చాలా గ్యాప్ తరవాత.. మళ్లీ తెలుగులో ఓ సినిమా చేశారు. ఈ సినిమానే ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయా?
– కథ నచ్చి చేశా. దానికి తోడు రవితేజ లాంటి కథానాయకుడితో మళ్లీ పనిచేసేయ అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటా..? తనతో ఇది నా నాలుగో సినిమా. ఫేవరెట్ కో స్టార్ రవితేజ. ఈ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నా పాత్ర ఏమిటి? దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి? అనే విషయాల్ని ఎక్కువ చెప్పలేను. ఏం చెప్పినా కథ రివీల్ అయిపోతుంది. కనీసం పాత్ర పేరు కూడా చెప్పలేను. కాకపోతే నటనకు చాలా స్కోప్ ఉంది. నా పాత్రలో చాలా కోణాలుంటాయి. ఇది పూర్తిగా కమర్షియల్ సినిమా. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.
* రవితేజ మూడు పాత్రల్లో కనిపిస్తారా? లేదంటే ఒక్కడే ముగ్గురిగా నటిస్తాడా?
– కొన్ని సినిమా కథలు ట్రైలర్ చూసి తెలుసుకోవొచ్చు. ఇంకొన్ని కథలు ట్రైలర్లో కూడా చెప్పలేం. `అమర్ అక్బర్ ఆంటోనీ` కథ అలాంటిదే. ఈ కథ గురించి నేనేం చెప్పలేను. ఈనెల 16న చూసి తెలుసుకోవాలి.
* తెలుగులో బిజీగా ఉన్నప్పుడే బాలీవుడ్‌కి వెళ్లిపోయారు… కారణమేంటి?
– జులాయి సినిమా చేస్తున్నప్పుడు `బర్ఫీ`లో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు చాలా సందిగ్థంలో ఉన్నా. ఆ సమయంలోనే త్రివిక్రమ్ గారిని సలహా అడిగా. `వెళ్లాలా? వద్దా` అని. ఇలాంటి అవకాశం వదులుకోకు అని ప్రోత్సహించారు. నిజానికి బర్ఫీ చాలా గొప్ప కథ. అలాంటి కథ నేనెప్పుడూ వినలేదు. అందుకే.. అటు వెళ్లా. ఒక్క సినిమా కోసమని వెళ్తే వరుసగా ఆఫర్లు వస్తూ వచ్చాయి.
* తెలుగులో సినిమాలు చేయను అని స్టేట్మెంట్లు ఇచ్చార్ట..?
– ఆరేళ్లు ఇక్కడ పనిచేసిన దాన్ని. అలాంటిది తెలుగు పరిశ్రమని ఎందుకు వదులుకుంటా? అసలు అలాంటి రూమర్లు ఎందుకు వచ్చాయో అర్థం కాదు.
* మరి ఇక్కడి నుంచి అవకాశాలు వచ్చాయా?
– కొన్ని వచ్చాయి. కానీ డేట్లు సర్దుబాటు కాలేదు. ఇంకొన్ని సార్లు కథ నచ్చలేదు. అందుకే వద్దునుకున్నా. ఈమధ్యలో ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో నటించమంటూ అడిగారు. పెద్ద దర్శకుడు, పెద్ద సంస్థ. అన్నీ బాగున్నాయి. కానీ నా పాత్ర చాలా చిన్నది. అలాంటి సినిమాల్లో నేను చేయడం వల్ల ఉపయోగం ఏమిటో నాకు అర్థం కాలేదు. అందుకే ఆ సినిమా వద్దనుకున్నా. ఆసినిమా పేరేంటి? దర్శకుడు ఎవరన్నది మాత్రం చెప్పను.
* దేవదాస్ నుంచి ఇప్పటి వరకూ మీలో కనిపించిన మార్పేంటి?
– అప్పుడు చాలా చిన్న పిల్లని. ఇరవై కూడా నిండలేదు. ఇప్పుడు 32. వయసు, వ్యక్తిత్వం, ప్రవర్తన, మనుషుల్ని అర్థం చేసుకునే విధానం ఇవన్నీ మారతాయి కదా? అప్పట్లో నాకేం తెలిసేది కాదు. దేవదాస్ షూటింగ్ తొలిరోజు మొహం మీద క్లాప్ కొడితే.. ఇదేంటి? ఇలా కొడుతున్నారు అనుకన్నా. పోకిరి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు చేయను గాక చేయను అని చెప్పా. ఆ సినిమా ఒప్పించడానికి మంజుల చాలా కష్టపడ్డారు. తీరా చూస్తే.. అది నా కెరీర్లో అద్భుత విజయాన్ని అందించింది. కథలపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. వచ్చినవి చేసుకుంటూ వెళ్లిపోయా. పనిని గౌరవించడం మొదలెడితే.. ప్రేమ పెరుగుతుంది. నాకూ అదే జరిగింది.
* తెలుగు పరిశ్రమలో వచ్చిన మార్పేంటి?
– ప్రచారానికి చాలా ప్రాముఖ్యం పెరిగింది. దేవదాస్ సమయంలో ప్రమోషన్లు పెద్దగా జరగలేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్లో నెల రోజుల ముందు నుంచీ ప్రచారం మొదలెడతారు. ఇక్కడా ఆ ట్రెండ్ మొదలైంది.
* తొలిసారి డబ్బింగ్ చెప్పారు.. ఎలా ఉంది ఆ అనుభవం?
– ఇది శ్రీను ఐడియా. ముందు నిర్మాతలు ఫోన్ చేసి డబ్ చేయమంటే.. `నో `అన్నాను. ఇనేళ్ల వరకూ డబ్బింగ్ చెప్పలేదు, ఇప్పుడెలా చెబుతా? అని అడిగాను. కానీ శ్రీను మాత్రం ఒప్పించాడు. డబ్బింగ్ థియేటర్లో అడుగుపెట్టినప్పుడు చమటలు పట్టేశాయి. తెలుగులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే.. పదాలు సరిగా పలకకపోతే బూతులు వచ్చేస్తాయి. అందుకే చాలా కంగారు పడ్డాను. కానీ మూడు రోజుల్లో డబ్బింగ్ పూర్తయిపోయింది.
* మీ గొంతు మీరు వింటే ఎలా అనిపించింది?
– నిజం చెబుతున్నా… నాకు చిరగ్గా అనిపించింది. నా డబ్బింగ్ నాకు అస్సలు నచ్చలేదు. ఎవరితోనైనా చెప్పించొచ్చు కదా.. అని అడిగాను. కానీ శ్రీను మాత్రం `ఈ పాత్రకు నీ గొంతే బాగుంటుంది` అని ధైర్యం చెప్పాడు. ఇక ముందు కూడా దర్శకులు అడిగితే తప్పకుండా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతా.
* తెలుగు పరిశ్రమకు దూరమై బాలీవుడ్ కి దగ్గరయ్యారు. ఇది మీకు ప్లస్ అయ్యిందా? మైనస్ అయ్యిందా?
– నేనెప్పుడూ లాభనష్టాలు బేరీజు వేసుకోను. నిజానికి తెలుగులో ఇంత గ్యాప్ వస్తుందనుకోలేదు. అలా జరిగిపోయిందంతే. ఏం జరిగినా మంచి కోసమే అనుకోవాలి.
* మునుపటిలా ఇప్పుడు కూడా గ్లామర్‌పాత్రలకే మొగ్గు చూపుతారా?
– ఇదివరకటిలా గ్లామర్ రోల్స్, పెర్‌ఫార్మ్సెన్స్ రోల్స్ అని లేవు. అమర్ అక్బర్ అంటోనీలో నా పాత్రని చూడండి. గ్లామర్‌గా నే ఉంటుంది. కానీ నటనకు ప్రాధాన్యం ఉంటుంది. ఇక మీదట ఇలాంటి పాత్రలే చేస్తా. నాయికా ప్రాధాన్యం ఉన్న సినమాలు కూడా చేయాలనివుంది. యువరాణిలా, వీరవనితలా కనిపించాలనివుంది. నేనెప్పుడూ తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటానని అనుకోలేదు. దర్శకుడు నన్ను నమ్మి నాకు ఆ బాధ్యత అప్పగించాడు. నేను చెప్పాను. ఇక మీదటా అంతే. దర్శకుడు నమ్మి నాకో కథ చెబితే.. తప్పకుండా చేస్తా. దర్శకుడ్ని గుడ్డిగా ఫాలో అయిపోతా.
* ఆండ్రూతో మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది?
– చాలా బాగుంది. ఇప్పటికే మా గురించి ఇన్‌స్ట్రాగ్రామ్ లో చాలా పోస్టులు పెట్టా. చాలా మాట్లాడా. వాటి గురించి ఇంకే మాట్లాడాలి. ఎంత చెప్పాలో అంత చెప్పా. అంతకంటే ఎక్కువ చెప్పను.
* మీటూ ని ఓ ఉద్యమంగా తీసుకెళ్తున్నారు దీనిపై మీ కామెంట్?
– వాళ్ల వాళ్ల అనుభవాల్ని, చేదు జ్ఞాపకాల్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇది మంచిదే. ఇలాంటి విషయాల గురించి మనం వీడి.. మాట్లాడడం మంచి పరిణామమే. ఎక్కడోచోట, ఎప్పుడోఒకప్పుడు పరిష్కారం దొరుకుతుందనే అనుకుంటున్నా.
* స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు. అది మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది..?
– స్టార్, సెలబ్రెటీ.. ఇలాంటి పదాలంటే అసహ్యం. నేను నటి.. అలానే చూడండి. నన్ను నేను అలానే చూసుకుంటా.
చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్లకు అవకాశాలు రావడం లేదంతే. ఈ విషయంలో నేను లక్కీ.
* నిర్మాణం, దర్శకత్వం.. వీటిపై దృష్టి ఉందా?
– నిర్మాతగా మారడం చాలా కష్టం. దర్శకత్వం కూడా పెద్ద బాధ్యత. దానికి చాలా స్కిల్స్ కావాలి.నాకంత ప్రతిభ లేదు. నేను నటిని మాత్రమే. అక్కడితో సరిపెడతా.