తెలంగాణలోని మహా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలీక్కి వచ్చినట్టే అంటున్నారు కూటమి నేతలు. కూటమిపై ఎలాంటి అనుమానాలొద్దని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అన్ని పార్టీలూ భాగస్వాములుగా ఉంటాయనీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామే అని ధీమా వ్యక్తం చేశారు. సీట్ల దక్కని కూటమి పార్టీల కీలక నేతలకు నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కోదండరామ్ నేతృత్వంలో ఉద్యమ ఆకాంక్షల కమిటీ ఏర్పాటవుతుందనీ, తాము అధికారంలోకి వచ్చాక ఈ కమిటీకి చట్టబద్ధత కూడా వస్తుందన్నారు.
సీట్ల కేటాయింపు విషయంలో సీపీఐ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీతో ఏఐసీసీ ఇన్ ఛార్జ్ సమావేశం కాగా, జన సమితి పార్టీతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు విషయమై సీపీఐ, జన సమితి పార్టీలు కొంత పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమావేశాలతో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. జనసమితికి ఇవ్వాల్సిన 8 సీట్లపై ఈరోజు స్పష్టత వచ్చిందనే నేతలు చెబుతున్నారు. మిర్యాలగూడపై జన సమితి ఆసక్తి చూపిస్తోంది. కానీ, తన కుమారుడిని అక్కడి నుంచే బరిలోకి దించాలని జానారెడ్డి అనుకుంటున్నారు. అయితే, తన కుమారుడికి మిర్యాలగూడ సీటు దక్కని పక్షంలో దాన్ని జనసమితికి ఇవ్వడానికి జానారెడ్డి ఒప్పుకున్నారట. ఇక్కడ ఇంకో మెలిక ఏంటంటే… అక్కడ విజయేందర్ రెడ్డి అనే జనసమితికి చెందిన నేతకే టిక్కెట్ ఇవ్వాలంటున్నారు. ఇక, ఆసిఫా బాద్, స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గాల్లో స్నేహపూర్వక పోటీకి జన సమితి, కాంగ్రెస్ లు సిద్ధమౌతున్నట్టు సమాచారం.
ఇక, సీపీఐ విషయానికొస్తే ఒక్క సీటు కోసమే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ లపై సీపీఐ స్పష్టంగానే ఉన్నట్టు సమాచారం. కొత్తగూడెం తమకు ఇవ్వాలన్న పట్టుదలను ఇంకా కొనసాగిస్తోంది. అయితే, ఇవాళ్ల సీపీఐ నేతలతో భేటీలో… పార్టీ కంటే కూటమి ప్రయోజనాలు ముఖ్యమనీ, ప్రభుత్వం ఏర్పాటు తరువాత పార్టీల ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుందామనీ, కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలని నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. అయితే, దీనిపై అంతిమ నిర్ణయాన్ని సీపీఐ నేతలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఈ చర్చలు సంతృప్తికరంగానే సాగాయని కాంగ్రెస్, సీపీఐ నేతలు అంటున్నారు. మొత్తానికి, 14వ తేదీలోగా కూటమి పార్టీల అభ్యర్థుల జాబితాలు కూడా ఒక కొలీక్కి వచ్చాస్తాయనే ఆశాభావం వ్యక్తమౌతోంది.