మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ అలియాస్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ లక్ష్యాలను చాలా స్పష్టంగా పెట్టుకుంటారు. అధికార పార్టీలతో అత్యంత సన్నిహితంగా ఉండి.. ఎంఐఎం గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టి… మిగతా చోట్ల.. ఆయా అధికార పార్టీలకు..సహకరిస్తూ ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్తో అలాగే వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి సహకారం కోసం అసదుద్దీన్ చర్చలకు చాన్సివ్వరు. ఎంఐఎం గెలుపు కోసం ప్రయత్నించాలనుకున్న నియోజకవర్గాలకు ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించేస్తారు. ఆ కోణంలో… ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పార్టీ బాధ్యత తలకెత్తుకుంటారు. అలా ఈ సారి.. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. మొట్టమొదటగా ఆ స్థానానికే అభ్యర్థిని ప్రకటించి.. జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,213,45ఓట్లు ఉండగా ఇందులో ముస్లిం మైనార్టీ ఓట్లు సుమారు లక్షా పదమూడు వేల వరకు ఉంటాయి. గత ఎన్నికల్లో 63.33 శాతం ఓట్లు పోలింగ్ జరింది. ప్రకాష్ గౌడ్ పాతిక వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ కు చెందిన జ్ఞానేశ్వర్ పై గెలుపొందారు. ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగా యాభై వేల వరకూ ఓట్లు తెచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎ.స్వర్ణలతారెడ్డికి 29వేల 870 ఓట్లు మాత్రమే వచ్చి..నాలుగో స్థానంలో ఉండాల్సి వచ్చింది. ముస్లి మైనార్టీ ఓట్లు గతంలో కంటే ఈసారి మరిన్ని పెరగడంతో గత కొన్నేళ్ల నుంచే ఎంఐఎం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. స్నేహపూర్వక పోటీలు ఉంటాయని కేసీఆర్ చెబుతున్నారు. కానీ.. రాజేంద్రనగర్ లో మాత్రం.. కారు స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని… ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అభ్యర్థి రహ్మత్ ఆర్థిక, అంగబలం సమకూర్చి పెడుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ.. రాజేంద్రనగర్ లో ఎంఐఎం జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో… అసదుద్దీన్ ఉన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున మంచి మెజార్టీతో గెలిచిన ఆయన.. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోపాయికారీ పొత్తుల్లో భాగంగా.. ఎంఐఎంకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్లుగా… ప్రకాష్ గౌడ్‌కు పెద్దగా సహకారం అందడం లేదు. అయినా.. తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ కన్నా.. ప్రకాష్ గౌడ్ .. తన సొంత బలంపైనే ఆధారపడి బండి గాలిస్తున్నారు. ఓ రకంగా.. ప్రకాష్ గౌడ్‌ను టీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్‌ను చేసిందన్న అంచనాలు రాజేంద్రనగర్ లో వినిపిస్తున్నాయి.