బాహుబలిలో కిలికిలి భాష సృష్టించాడు రాజమౌళి. ఆ పద ప్రయోగాలు అప్పటికీ, ఇప్పటికీ.. చలామణీ అవుతూనే ఉన్నాయి. భాష వాడాలని అర్థం పర్థం లేని పదాలు చేర్చకుండా… దానికంటూ ప్రత్యేకమైన కసరత్తు చేశారప్పట్లో. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’లోనూ ఓ కొత్త తరహా భాష వినిపించనుంది. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ డైలాగులు అందిస్తున్నారు. ఆయనతో పాటు మరో పేరు కూడా లిస్టులో కనిపించింది. ఆయనే.. కార్కీ. ఈ తమిళ రచయితే ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్` కోసం ఓ కొత్త భాష రాస్తున్నాడట. ఎన్టీఆర్ పలికే కొన్ని సంభాషణలు కొత్త తరహా భాషలో వినిపిస్తాయని, అందుకోసం కార్కీ చేత ఓ భాష సృష్టించేపనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. కిలికిలి భాష కోసం ఎలాంటి కసరత్తులు చేశారో.. ఇప్పుడు కూడా అలానే ఓ పద్ధతి ప్రకారం ఈ భాష పుట్టిస్తారని సమాచారం. ఆదివారం హైదరాబాద్లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈనెల 19 నుంచి తొలి షెడ్యూల్ జరగబోతోంది. తొలుత యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటుంది. వాళ్లెవరన్నది త్వరలో తెలుస్తుంది.