కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విషయంలో ఎడతెగని సాగదీత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓపక్క మహా కూటమి భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై కూడా సిగపట్లు కొనసాగుతున్నాయి. ఇంకోపక్క, కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసే స్థానాలపై కూడా సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి. టిక్కెట్టు దక్కదేమో అనే అనుమానం వచ్చినవారంతా మద్దతుదారులతో గాంధీభవన్ ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడి పరిణామాలన్నీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కొంత చిరాకు తెప్పించినట్టు సమాచారం!
సీట్ల సర్దుబాటు అంశమై చర్చించేందుకు రాహుల్ తో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాతోపాటు ఏఐసీసీ కార్యదర్శులు ఢిల్లీలో సమావేశమయ్యారు. స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన అభ్యర్థుల జాబితాను రాహుల్ పరిశీలించారు. కులాలవారీగా, కుటుంబాలపరంగా.. ఇలా ఏయే ప్రాతిపదిక సీట్లు ఇవ్వబోతున్నారో అనేది నేతల్ని అడిగి రాహుల్ తెలుసుకున్నారు. అయితే, ఈ సందర్భంగా రాష్ట్ర నేతల తీరుపై రాహుల్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కథనాలు వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇంత గందరగోళంగా ఎందుకు చేస్తున్నారనీ, రాష్ట్రంలో వ్యక్తమౌతున్న అసంతృప్తులను ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారనీ, నిరసనలు గాంధీ భవన్ వరకూ ఎందుకు రానిచ్చారంటూ ఒకింత మండిపడ్డట్టు తెలుస్తోంది.
నిజానికి, తెలంగాణలో సీట్ల సిగపట్లు ఉంటాయనేది రాహుల్ ని కొత్తగా తెలిసిన అంశమైతే కాదు! ఎందుకంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న ఐక్యత ఏపాటిదో ఇప్పటికే హైకమాండ్ కు తెలుసు. పదవుల కోసం ఏయే నేతల ఎన్నాళ్లుగా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారో వారికీ తెలుసు కదా! ఒక్కో స్థానానికి కనీసం ఐదుగురు ఆశావహులు ఉంటున్న పరిస్థితి ఇవాళ్ల కొత్తగా ఉత్పన్నమైంది కాదు. అందుకే కదా… అసంతృప్తులు ఇలా బయట పడకూడదనే ఉద్దేశంతోనే ముందుగా అందర్నీ ఢిల్లీకి పిలిచి మరీ బుజ్జగింపులు చేశారు. వాస్తవానికి.. ఫెయిలైంది ఆ బుజ్జగింపుల ప్రక్రియ. తాత్కాలిక అవసరాల కంటే… దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పాటుపడాలి అనే అంశాన్ని శ్రేణుల్లోకి మొదట్నుంచీ ఎక్కించడంలో నాయకత్వం ఫెయిల్ అవుతూనే ఉంది. ముందుగా, దాన్ని సెట్ చేసే ప్రయత్నాలు బలంగా జరగలేదు. ఓరకంగా ముందస్తు ఎన్నికలు రావడమూ ఈ ఇబ్బందికి మరో కారణం అనుకోవచ్చు. కాబట్టి, ఈ పంచాయితీలు ఇప్పటికిప్పుడే ఆగిపోతాయా అంటే.. రాష్ట్ర నేతలే నమ్మకంగా చెప్పలేని పరిస్థితి.