తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… అత్యంత క్లిష్టమైన నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను కూడా… ఉఫ్ మని ఊదేసినట్లుగా… ప్రకటించేశారు. కానీ ఆయనకు అత్యంత ప్రాధాన్యమైన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థిని ఖరారు చేయడానికి తంటాలు పడాల్సి వస్తోంది. దానికి కారణం అభ్యర్థి లేక కాదు… అంతకు మించిన తంటాలను… అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తెచ్చి పెడుతున్నారు. అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లిస్తామని.. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. చివరికి ఎవరికీ ఇవ్వలేదు. టిక్కెట్లు ఫైనల్ చేసే ముందు.. ఎల్బీనగర్ సెంటర్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి రగడ చేయడంతో…ఆశల్లేని హుజూర్ నగర్ టిక్కెట్ ను ఇచ్చారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో ఆమె గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే… అప్పట్నుంచి ఆమె… ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ గానే కొనసాగుతున్నారు.
ఈ ఎన్నికల్లోనూ.. తనకే టిక్కెట్ ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు. కేసీఆర్ పై పాజిటివ్ గానే ఉంటున్నా.. నల్లగొండ మంత్రి జగదీష్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనకు టిక్కెట్ రాకుండా ఆయనే చేస్తున్నారని… ఆరోపణలు చేస్తున్నారు. వారానికోసారి తెలంగాణ భవన్ కు వచ్చి… అసంతృప్తిని.. ఆవేదనను… ఆత్మాహుతికి ముడిపెట్టి.. చెబుతున్నారు. సోమవారం కూడా.. తెలంగాణ భవన్‌కు వచ్చి తాను ఒక బీసీ మహిళనని ఒక అమరవీరుని తల్లినని చూడకుండా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని బాధపడ్డారు. ఎన్నారై సైదిరెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని ఆయన్ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అయినా కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ప్రాణం పోయినా పార్టీని వీడనని వెల్లడించారు.
తనకు టికెట్ ఇవ్వకపోతే అమరవీరులకు అవమానమని శంకరమ్మ అంటున్నారు. ఒకవేళ తనను కాదని… సైదిరెడ్డికి టికెట్ ప్రకటిస్తే.. సూర్యాపేట తెలంగాణ తల్లి విగ్రహం ముందు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని హెచ్చరించారు. తన చావుకు మంత్రి జగదీష్రెడ్డిదే బాధ్యత అని శంకరమ్మ ప్రకటించారు. ఇది చాలా సెంటిమెంట్‌తో కూడుకున్న అంశం. ఆమెను బుజ్జగించకుండా.. టిక్కెట్ ప్రకటిస్తే.. పట్టింపుతో ఆమె ఏమైనా చేసుకుంటే.. దాని వల్ల వచ్చ చెడ్డ పేరు.. టీఆర్ఎస్ మొత్తాన్ని ముంచేస్తోంది. అందుకే కేసీఆర్.. ఆమెకు సర్దిచెప్పాలో తెలియక సతమతమవుతున్నారు.