ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, వైకాపాలు రెండూ కూడా ప్రత్యేక హోదా సాధించాలని పోరాటం మొదలుపెట్టి ప్రజల నుండి స్పందన రాకపోవడంతో మధ్యలోనే నిలిపివేశాయి. అది స్వయంకృతాపరాధమే తప్ప అందుకు ప్రజలను తప్పు పట్టడానికి లేదనే చెప్పవచ్చును. ఎందుకంటే అవి చేసిన పోరాటాలలో వాటి నిజాయితీ, చిత్తశుద్ది కంటే వాటి వెనుక దాగి ఉన్న రాజకీయ కారణాలు, రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనిపించాయి. కనుకనే ప్రజలు వాటి పోరాటాలకి సహకరించలేదు.
చేసే పోరాటంలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఏవిధంగా సహకరిస్తారో తెలుసుకోవాలంటే తెలంగాణా కోసం తెరాస నేతృత్వంలో జరిగిన పోరాటాలను చూసినట్లయితే అర్ధం అవుతుంది. రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతున్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదా అంశం ద్వారా మళ్ళీ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తన శత్రువుగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయనను రాజకీయంగా దెబ్బ తీయాలని, ఒకవేళ దెబ్బ తీయలేకపోయినా కనీసం దీనితో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రత్యేక పోరాటాలు మొదలుపెట్టారని చెప్పవచ్చును. ఒక పార్టీ తను మనుగడ కోసం మరొక పార్టీ తన రాజకీయ కక్ష కోసం దీనిని ఆయుధంగా మలుచుకోవాలని ప్రయత్నించడం వలననే ప్రజలు సహకరించలేదు.
తెదేపా-బీజేపీల మధ్య స్నేహం, కేంద్రంతో ఉన్న అవసరాల దృష్ట్యా తెదేపా ప్రభుత్వం కూడా దీని గురించి కేంద్రాన్ని ఎన్నడూ గట్టిగా నిలదీయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి, ప్రతిపక్షాల నుండి, రాష్ట్ర ప్రజల నుండి ఎటువంటి ఒత్తిడి లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుండి అభ్యంతరాలు వంటి అనేక కారణాల చేత కేంద్రప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోలేదు. అందుకు రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికలలో తెదేపా, బీజేపీలకు కూడా తగిన విధంగా గుణపాఠం చెపుతారా లేదా..అనేది వేరే విషయం. ఇప్పటికి మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చివరికి రాష్ట్ర ప్రజలు కూడా గతించిపోయిన అంశంగా పరిగణిస్తున్నారు.
తను మొదలుపెట్టిన పోరాటానికి ప్రజల మద్దతు కొరవడినందునే విఫలమయిందనే సంగతి జగన్మోహన్ రెడ్డికి బాగానే అర్ధమయింది కానీ తన పోరాటంలో నిజాయితీ, చిత్తశుద్ది లోపించడం వలననే ప్రజల సహాకారం లభించలేదనే విషయం మాత్రం ఆయన అంగీకరించడానికి సిద్దంగా లేరని ఈరోజు కాకినాడలో నిర్వహించిన యువభేరి సమావేశంలో ఆయన మాటల ద్వారా మరోమారు స్పష్టమయింది. ప్రజలు చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెస్తే ఆయన ప్రధాని నరేంద్ర మోడిపై ఒత్తిడి తెస్తారని అని చాలా చక్కగా చెప్పారు. తద్వారా ఇప్పటికి కూడా ఆయన లక్ష్యం చంద్రబాబు నాయుడే తప్ప ప్రత్యేక హోదా మంజూరు చేయవలసిన కేంద్రప్రభుత్వం కాదని స్పష్టమయింది. చంద్రబాబు నాయుడు ఎన్నటికీ అటువంటి పని చేయరని, అందుకు కారణాలు ఏమిటో కూడా అందరికీ తెలుసు. అటువంటప్పుడు రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా చాలా అవసరమని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నట్లయితే, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధినేతగా ఉన్న ఆయనే నేరుగా కేంద్రప్రభుత్వం ఒత్తిడి చేయవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి చేద్దామని స్వయంగా చెప్పడం గమనిస్తే, ఆయన ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం అవుతోంది.
అమరావతి శంఖుస్థాపనకి ఆయనని ఆహ్వానించినప్పుడు, ఆయన దానిని అంగీకరించి ఉండి ఉంటే, వేలాది ప్రజల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడిని దీని గురించి నేరుగా నిలదీయగలిగేవారు. కానీ ఆవిధంగా చేసినట్లయితే బహుశః తనపై ఉన్న సిబిఐ కేసులు తిరగదోడే ప్రమాదం ఉందనే భయంతోనే, ఆయన ఆ అవకాశాన్ని చేజేతులా వదిలిపెట్టారని చెప్పకతప్పదు. కానీ తనకి ప్రత్యేక హోదా అంశంపై చాలా శ్రద్ధ ఉందని ప్రజలను మభ్య పెట్టేందుకే దాని గురించి ప్రధానితో గన్నవరం విమానాశ్రయంలో కానీ తిరుపతి విమానాశ్రయంలో గానీ మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ కోరారని చెప్పవచ్చును. ఊహించినట్లుగానే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదు కనుక జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఇబ్బంది తప్పిపోయింది. ఒకవేళ అపాయింట్ మెంట్ ఇచ్చినా ఒక వినతి పత్రం ఆయన చేతిలో పెట్టి తిరిగి వచ్చి ఉండేవారేమో?
ఇటువంటి వైఖరి కారణంగానే ఆయన చేస్తున్న పోరాటాన్ని ఎవరూ విశ్వసించడం లేదు. ఎవరూ కలిసి రావడం లేదని చెప్పవచ్చును. అయితే ఆయన అంతిమ లక్ష్యం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే కనుక ఇటువంటి ప్రయత్నాలు చేయడం కంటే తన లక్ష్యసాధనకు సరయిన మార్గం పద్దతులను ఎంచుకొని ముందుకు సాగినట్లయితే ప్రయోజనం ఉండవచ్చును. కానీ ఇది కూడా తన లక్ష్య సాధనలో ఒక భాగమే అనుకొంటే నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంటుంది.