ఎల్బీనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య… విద్యార్థుల స్కాలర్ షిప్ పోరాటాలతో బీసీ సంక్షేమ సంఘం నేతగా… గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ గత ఎన్నికల కిందటి వరకూ ఆయన రాజకీయాలకు దూరం. గత ఎన్నికల్లో చంద్రబాబు ఆశల్లేని చోట.. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో.. గాల్లో రాయి వేసి.. తటస్థుని కోటాలో.. ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి.. ఎల్బీనగర్లో పోటీ చేయించి.. అతి కష్టం మీద గెలిపించగలిగారు. కానీ ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీనే ఇబ్బంది పెట్టడంతో… చివరికి ఆ పార్టీ లైట్ తీసుకుంది. ఇప్పుడు ఆర్.కృష్ణయ్యకు ఏ పార్టీ లేకుండా పోయింది. టీఆర్ఎస్ పిలవలేదు. కాంగ్రెస్ పిలిచింది కానీ.. టిక్కెట్ ఇస్తామని చెప్పలేదు. కానీ కృష్ణయ్యకు మాత్రం… తనకు ఎల్బీనగర్ నుంచే పోటీ చేయాలనే ఆశ ఉంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. కోపం వచ్చి బంద్‌కు పిలుపునిచ్చేశారు.
బీసీలకు రాజకీయ పార్టీలు మొండి చెయ్యి చూపాయని… దీనికి నిరసనగా ఈనెల 17న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్న కృష్ణయ్య ప్రకటించారు. తనకు ఎల్బీనగర్ టిక్కెట్ పై అంతో ఇంతో ఆశ పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందుకే కాస్తంత ఎక్కువగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసి.. ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకటించిన అరవై ఐదు మందిలో కాంగ్రెస్ 13 మంది బీసీలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చిందని… మహాకూటమి పేరుతో ప్రజలను దోచుకోవాలని చూస్తున్నారని మండిపడిపోతున్నారు. బీసీలకు సాంప్రదాయంగా కేటాయిస్తూ వస్తున్న సీట్లను…అగ్రవర్ణాలకు కట్టబెడుతున్నారని ఆరోపించేస్తున్నారు.
కృష్ణయ్య కోపం చూస్తూంటే.. తను తాజామాజీగా ఉన్న ఎల్పీనగర్లో అసలు తనను ఏ పార్టీ కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదనే బాధ వెంటాడుతున్నట్లు ఉందని సెటైర్లు పడుతున్నాయి. బీసీ ఉద్యమ నేతగా.. తనకు ఏ పార్టీ అయినా పిలిచి టిక్కెట్ ఇస్తుందని..సులువుగా పోటీ చేస్తానని ఆయన అనుకున్నారు. కానీ ఆయనను.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మాత్రమే పిలిచింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పింది. కానీ… కృష్ణయ్యకే నమ్మకం కలగలేదు. అయినా.. రాజకీయ పార్టీలు అవకాశాలు ఇవ్వకపోతే.. బంద్ పిలుపునిస్తారా..? పిలుపునిస్తే మాత్రం ఎవరైనా పట్టించుకుంటారా..? బందులు చేయాలంటే.. రాజకీయ పార్టీల వల్ల తప్ప.. ఇంకెవరి వల్లా కాదు. ఎందుకంటే… ఇప్పుడు స్వచ్చంద బంద్‌లు లేవు.. అన్నీ రాజకీయ పార్టీలు బలవంతంగా చేసే బందులే..!