హైదరాబాద్‌లోని కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేయబోతోందా..? ఇప్పటి వరకూ… ఎలాంటి సూచనలు లేని.. ఈ వార్త.. హఠాత్తుగా… ప్రధాన మీడియాలో ప్రత్యక్షమయింది. నామినేషన్లు ప్రారంభమై.. రెండు రోజులు ముగిసిన తర్వాత కూకట్ పల్లికి నందమూరి కుటుంబం నుంచి పేరు బయటకు రావడం.. టీడీపీలోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ మహాకూటమిలో భాగంగా.. టీడీపీ వచ్చే.. పధ్నాలుగు సీట్లలో.. కూకట్పల్లి మొదటిది. అయితే… ఖరారైన మిగతా తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు కానీ.. కూకట్ పల్లి విషయాన్ని మాత్రం పెండింగ్‌లో ఉంచారు.
కొద్ది రోజుల క్రితం… తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని భవ్య ఆనందప్రసాద్‌కు, కూకట్పల్లి స్థానాన్ని సీనియర్ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డికి ఇవ్వాలని చెప్పినట్లు ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే భవ్య ఆనందప్రసాద్‌కు శేరిలింగంపల్లి టిక్కెట్‌ను ఖరారు చేశారు.. కానీ కూకట్పల్లి విషయాన్ని మాత్రం పెండింగ్‌లో ఉంచారు. కూకట్‌పల్లిలో పెద్దిరెడ్డి అభ్యర్థిత్వంపై.. అక్కడి క్యాడర్లో సానుకూలత రాలేదన్న కారణం ప్రచారం అవడమే కాదు. హఠాత్తుగా… హరికృష్ణ కుమార్తె పేరు ప్రచారంలోకి వచ్చింది. సుహాసిని.. రాజమండ్రి మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ సతీమణి.
నందమూరి హరికృష్ణ మరణం తర్వాత.. ఆ కుటుంబానికి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని.. అప్పట్లో ప్రచారం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌ను పొలిట్‌బ్యూరో తీసుకుంటారని చెప్పుకున్నారు. కల్యాణ్‌రాంకు.. శేరిలింగంపల్లి బరిలో నిలుపుతారని కూడా… ప్రచారం జరిగింది. అయితే వీటికి ప్రాతిపదిక లేదు. ఈ ఇద్దరూ రాజకీయాలపై ఆసక్తి లేనట్లుగా ఉన్నారు. ఈ క్రమంలో… హరికృష్ణ కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యాన్ని.., ఆయన కుమార్తెకు ఇస్తే ఆలోచన ఎలా ఉంటుందన్న చర్చతో పాటు.. ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి… మీడియాకు టీడీపీ వర్గాలు లీకులిచ్చాయని.. భావిస్తున్నారు. కూకట్‌పల్లిలో సానుకూలత వ్యక్తమైతే.. ఆమె అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేసే అవకాశం ఉంది. నామినేషన్లకు ఎంతో సమయం లేదు..కాబట్టి ఒకటి, రెండు రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.