కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై, ఆ పార్టీ సొంత నాయకుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం లో తమ పార్టీ విఫలమైందని, యువతకు పెద్ద పీట వేయలేదని ఉద్యమకారులకు తగిన గుర్తింపు నివ్వలేదని వ్యాఖ్యానించారు రేణుక.
ఖమ్మం జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన కమ్మ సామాజిక వర్గానికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మొత్తం మీద ఒక్క టికెట్ ఇవ్వక పోవడం శోచనీయం అన్నారు రేణుకా చౌదరి. పొత్తుల్లో భాగంగా ఇచ్చిన సీట్లలో కమ్మవారికి ఇచ్చారు కాబట్టి అది సరిపోతుంది అనుకోవడం సరికాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖమ్మం జిల్లాలో ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించి ఉంటే బాగుండేది, అని అభిప్రాయపడ్డారు రేణుకా చౌదరి. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లేరు అనుకోవడం తప్పు అభిప్రాయం, అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా మహాకూటమికి పడతాయనే ఉద్దేశంతో, అలాంటప్పుడు ఆ సామాజికవర్గానికి టికెట్లు ఇవ్వకుండా ఆ సామాజిక వర్గం ఓట్లు పడతాయని ఎలా భావిస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి.
ఇటు తెలుగుదేశం అటు టిఆర్ఎస్ కూడా కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఉండగా, కాంగ్రెస్ మాత్రం ఆ సామాజికవర్గాన్ని విస్మరించడం పార్టీకి నష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు రేణుకా చౌదరి.