గ్రేటర్ ఎన్నికలలో వంద సీట్లు లేదా మంత్రి పదవికి రాజీనామా అని మంత్రి కె.టి.ఆర్. సవాలు చేయడం, ఆ తరువాత దానిని ఉపసంహరించుకోవడం జరిగింది. ఆయన తరువాత ఇప్పుడు మరో మంత్రి హరీష్ రావు కూడా సరిగ్గా అటువంటి సవాలే విసరారు. మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ ఉపఎన్నికలలో తెరాస రధసారధిగా ఉన్న ఆయన, గ్రేటర్ ఎన్నికలకి దూరంగా ఉంచబడటం వలన చాలా తాపీగా ప్రచారం చేసుకొంటూ ఇప్పటికే అక్కడ కొంత పట్టు సాధించారు. ఆ ధీమాయే ఆయన చేత సవాలు చేయించినట్లుంది.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నారాయణఖేడ్ ఉపఎన్నికలలో మా పార్టీ అభ్యర్ధి ఓడిపోయినట్లయితే, నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దం, కాంగ్రెస్, తెదేపా, బీజేపీలలో ఎవరయినా సరే నా సవాలును స్వీకరించదానికి సిద్దంగా ఉన్నారా?” అని ప్రతిపక్షాలకి సవాలు విసిరారు. దానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ ఇంకా స్పందించలేదు కానీ తెదేపా తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం చాలా ఘాటుగా జవాబిచ్చారు.
“ఇక్కడ ముందుగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఇక్కడ ఉండకుండా నారాయణఖేడ్ ఎందుకు వెళ్ళిపోయారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కె.టి.ఆర్. ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి అక్కడికి తరిమేశారు. ఆ సంగతి గురించి ప్రస్తావించకుండా ప్రతిపక్షాలకు సవాళ్లు విసరుతున్నారు. నారాయణఖేడ్ లో ఆయన నిర్వహిస్తున్న ప్రచార సభలకి జనాలు రాకపోవడంతో తన సిద్ధిపేట నియోజక వర్గం నుంచి జనాలను తరలించుకొని వచ్చి సభలు నిర్వహించుకొంటున్నారు,” అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.