‘కులాల్నీ మతాల్నీ ప్రాంతాల్నీ సమానంగా చూడగలిగే శక్తి ఉన్నవాడిని నేను’ అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ.. తనలో స్వార్థం లేదనీ, రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయిపోవాలని లేదన్నారు. ఎన్ని దశాబ్దాలైనా ఒక మార్పు తీసుకుని రావాలనే ఆలోచనా ధోరణి ఉన్నవాడిని అని చెప్పుకున్నారు. తనకు ఓటమి భయం లేదనీ, మార్పును తీసుకుని రాగల ఆలోచనా బలం ఉన్నవాడినని చెప్పారు.
2009లో కొత్త పార్టీ పెట్టిన చిరంజీవి దాన్ని ముందుకు తీసుకుని వెళ్లలేకపోవడానికి కారణం… కొద్దిమంది వ్యక్తులు అన్నారు పవన్. వారి దగ్గర భావజాలం లేదనీ, ఆయన పక్కన ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులే వేరే పార్టీలకు వెళ్లిపోయారన్నారు. పార్టీని కలిసేశారన్నారు. దాంతో ఒక బలమైన మార్పును తీసుకొచ్చే సమయం ఆరోజున పోయిందన్నారు. కానీ, ఈసారి జనసేనలో ఏ స్థాయి నాయకులు అవకతవకలు చేసినా వాటిని అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తాను నాయకుల ఇగోలను సర్దుబాటు చెయ్యననీ, ప్రజల సమస్యలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాను అన్నారు. ఎవరో లేకపోతే పార్టీ నడవదు అనే పరిస్థితిలో జనసేన ఉండదన్నారు. ఆ తరువాత, మళ్లీ కులాల టాపిక్ ఎత్తుకున్నారు. టీడీపీ నేతలు కులాల పేరుతో విమర్శలు చేస్తున్నారనీ, కులాల ఐక్యత కోసమే జనసేన ఉందన్నారు. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, మంత్రి నారా లోకేష్ మీదా విమర్శలు చేశారు.
పార్టీ మారే వారిని భావజాలం లేని నాయకులు అన్నారు పవన్. మరి, ఇప్పుడు జనసేనలోకి వచ్చి చేరినవారు కూడా ఏదో ఒక పార్టీ నుంచి వచ్చినవారే కదా! పవన్ ద్రుష్టిలో ఇది చేరికలు కావొచ్చేమోగానీ.. వారి ద్రుష్టిలో అది పార్టీ మారడం మాత్రమే. ఇంకోటి… ప్రజారాజ్యం పార్టీ నుంచి కొంతమంది నాయకులు వేరే పార్టీకి వెళ్లి, ఆ పార్టీని వేరే పార్టీలో కలిపేశారనడం మరీ ఆశ్చర్యకరం. ఎందుకంటే, ఒక పార్టీ నుంచి నాయకులు బయటకి వెళ్తున్నారంటే ఒకే ఒక్క కారణం ఉంటుంది. నాయకత్వం మీద, పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం సడిలితే ఏ పార్టీలోనూ నాయకులు ఉండరు. నాయకుల్లో భావజాలాన్ని బలంగా నిలబెట్టాల్సి ఉంచాల్సిన బాధ్యత అధినేతదే అవుతుంది. లేదంటే ఎవరి దారి వారు చూసుకుంటారు. గత ఎన్నికల తరువాత ఆంధ్రాలో కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇదే, తెలంగాణలో టీడీపీ నేతల వలసలకూ కారణం ఇదే. అప్పుడు ప్రజారాజ్యం విషయంలోనూ జరిగింది కూడా అచ్చంగా ఇదే. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిందెవరో ప్రజలు మరచిపోలేదే..! ఇంకోటి… పదవుల ఆశతో తన పార్టీలోకి చేరొద్దని పిలుపునిస్తున్నారు పవన్. ‘నాకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వద్దు, ఏ ప్రయోజనాలూ వద్దు, కేవలం సేవ కోసమే వచ్చాను’ అని పార్టీల్లో చేరేవారు ఎంతమంది ఉంటారు..?