తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరో ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డిని, రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి గణేష్ గుప్తాలను అభ్యర్థులుగా ప్రకటించింది. ఇంతకు ముదు తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తాజా ప్రకటనతొ పదకొండు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లయింది. కూకట్ పల్లి స్థానం టీడీపీకి కేటాయింపు జరిగినా.. అభ్యర్థి విషయంలో .. ఇంకా స్పష్టత రాలేదు. మరో రెండు నియోజకవర్గాలను.. కాంగ్రెస్ పార్టీ.. టీడీపీకి కేటాయించాల్సి ఉంది. ఆ నియోజకవర్గాలేమిటన్నదానిపై స్పష్టత లేదు. సామ రంగారెడ్డి.. ఎల్బీనగర్ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్నారు. 2009,2014లలో.. రెండు సార్లు టీడీపీ టిక్కెట్ కోసం.. తీవ్రంగా ప్రయత్నించారు. ఓ సారి .. ఎస్వీ కృష్ణప్రసాద్ అనే నేతకు ఇవ్వడంతో.. వెనక్కి తగ్గారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఖాయమనుకున్న సమయంలో.. చివరి క్షణంలో.. ఎల్బీ నగర్ నుంచి ఆర్.కృష్ణయ్యకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. రెండు సందర్భాల్లో సామ రంగారెడ్డి.. అసంతృప్తి వ్యక్తం చేసినా.. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడ్డారు.
గత ఎన్నికల్లో ఎన్నికల రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన… ఆర్.కృష్ణయ్య తరపున మొత్తం బాధ్యతలు మీద వేసుకుని పని చేశారు. ఈ సారి పొత్తు ఉన్నా లేకపోయినా.. టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఆయన చాలా రోజుల నుంచి ఏర్పాట్లు చేసుకున్నారు. అనూహ్యంగా టీడీపీతో పొత్తు ఖరారు కావడంతో ఎల్బీనగర్ సీటు .. కాంగ్రెస్ కు పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన ఆందోళన చెంది.. అమరావతి టు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనుచరులతో చక్కర్లు కొట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అనుచరులతో కలిసి ఆందోళన కూడా చేశారు. చివరికి ఎలాగోలా సమీకరణాలను.. లెక్క చూసి.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని టీడీపీ తీసుని.. ఆ స్థానంలో.. పోటీకి సామ రంగారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఆనుకునే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఉంటుంది. గత ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీనే గెలిచింది. కానీ గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అల్లు అర్జున్ మామ.. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా.. టీడీపీ అధినేతను కలిసినట్లు ప్రచారం జరిగింది.
రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీలో చాలా కాలం నుంచి గణేష్ గుప్తాకు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కానీ… కుటుంబానికి ఒక్కటే టిక్కెట్ అనే సూత్రాన్ని వర్తింపు చేసినట్లు తెలుస్తోంది. చేవెళ్లే ఎంపీ టిక్కెట్ ఇస్తామని.. హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సనత్ నగర్ నియోజకవర్గాన్ని కూడా టీడీపీ కోరుతోంది. ఆ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించాల్సి ఉంది.