ఆర్.ఎక్స్ 100…. చిన్న సినిమాలకు ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తరవాత వచ్చిన `నాటకం` లాంటి ఊరూ పేరు లేని చిత్రాలు మంచి బిజినెస్ చేసుకున్నాయి. అమ్మాయిల పాత్రల్ని నెగిటీష్ షేడ్‌లో చూపిస్తే… యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవొచ్చన్నకొత్త విషయాన్ని చెప్పింది. సరిగ్గా ఇదే పాయింట్‌తో మరో చిన్న సినిమా వస్తోంది. అదే.. `నేను లేను`. ఇందులో అంతా కొత్తవారే. కొత్త వాళ్లతో ఓ చిన్న సినిమా తీయడం సాహసం. ట్రైలర్, టీజర్ బాగుంటే తప్ప.. వాటిపై దృష్టి పడదు. అందుకే ఈ చిత్రబృందం కాస్త మసాలా ఘాటు దట్టించి టీజర్ విడుదల చేసింది. అమ్మాయిలు మీద పడిపోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలూ జొప్పించి.. తమ సినిమాలో ఉన్న కంటెంట్ ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేసింది. ఆర్.ఎక్స్ 100లా ఇందులోనూ హీరోయినే విలన్. కథానాయికని పిచ్చిగా ప్రేమించే హీరో- దాన్ని అలుసుగా తీసుకుని తన కోరికల్ని తీర్చుకునే హీరోయిన్. ఇదీ స్థూలంగా `నేను లేను` కథ. యువతను కిర్రెక్కించడానికి ఎలాంటి షాట్లు పడాలో.. అవన్నీ.. టీజర్లో పెట్టేశారు. మరి ఈ సినిమా ఆర్ ఎక్స్ 100లా నిలబడుతుందా, లేదంటే నాటకంలా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందా… అనేది చూడాలి.