ఈతరం హీరోల్లో.. స్టార్ డమ్ సొంతం చేసుకున్న అతి కొద్దిమందిలో విజయ్ దేవరకొండ ఒకడు. చేసింది తక్కువ సినిమాలే అయినా – తనదంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. అనతి కాలంలోనే అభిమానుల్ని సంపాదించుకోగలిగాడు. అలాంటి విజయ్‌దేవరకొండ సినిమాలు మానేద్దామని నిర్ణయించుకున్నాడట. అదెప్పుడో.. అవకాశాల కోసం తిరిగి తిరిగి – అలిసిపోయినప్పుడు కాదు. ఈమధ్యే. అవును… ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ సినిమాల హిట్‌తో హీట్‌లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెబుదామనుకున్నాడట. ఎందుకు?? ఏమైంది? అని అడిగితే…
”ఓరోజు మా అమ్మకి ఒంట్లో బాలేదు. కార్లో ఆసుపత్రికి తీసుకెళ్తున్నా. అమ్మ పరిస్థితి చూసి భయమేసింది. ఎందుకో ఆ క్షణం ఈ సినిమాలన్నీ వదిలేయాలి అనిపించింది. నిర్మాతలకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పేద్దామనుకున్నా. అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేయాలనిపించింది. కానీ.. ఆ మూమెంట్ లోంచి తొందరగానే బయటపడ్డా” అని చెప్పుకొచ్చాడు విజయ్. ఈమధ్య వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుతుపుతున్నాడు. ఆ సంగతి గుర్తు చేసుకుంటూ..”ఇక ముందు సినిమా తరవాత సినిమా అనే పద్ధతితోనే వెళ్తా. అప్పుడు నాకోసం నేను కాస్త సమయం కేటాయించుకునే అవకాశం దక్కుతుంది” అంటున్నాడు. తను కథానాయకుడిగా నటించిన ‘టాక్సీవాలా’ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.