తెలుగులో సంచనలం సృష్టించిన చిత్రం `అర్జున్‌రెడ్డి`. దీన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే బాలీవుడ్‌లోనూ ఈ సినిమాని రీమేక్ చేస్తుండడంతో అక్కడ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షాహిద్ కపూర్‌ని విజయ్ పాత్రకు తీసుకోవడంతో మరింత హైప్ వచ్చింది. ఈ చిత్రానికి ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. బాలీవుడ్ రీమేక్‌పై, టైటిల్‌పై విజయ్ దేవరకొండ తొలిసారి స్పందించాడు.
”హిందీ టైటిల్ చాలా బాగుంది. తెలుగులో `అర్జున్ రెడ్డి` అనే టైటిల్ పెట్టినప్పుడు ఎవరికీ పెద్దగా ఎక్కలేదు. ‘ఫ్యాక్షన్ సినిమా తీస్తున్నారా ఏంటి?’ అనుకున్నారు. కానీ.. టీజర్, ట్రైలర్ వచ్చేసరికి ఓ అంచనా ఏర్పడింది. కబీర్ సింగ్ అయితే తొలిసారి వినగానే టైటిల్ బాగా నచ్చేసింది. సందీప్ ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడు. టీజర్, ట్రైలర్ వస్తేగానీ అదేమిటో అర్థం కాదు. ఈసినిమా గురించి నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటున్నాడు విజయ్.