పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ తీరు మారడం లేదు ఆయన మరొకసారి వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మాజీ సర్పంచ్ మరియు వైఎస్ఆర్సిపి నేత కృష్ణారావు ఏలూరు నుంచి గార్లమడుగు వస్తుండగా దారి మధ్యలో కొందరు పోలవరం కుడికాలువ గట్టు మట్టిని యంత్రాలతో తవ్వి టిప్పర్లలో పోస్తుండటం కనిపించింది. ఆయన పోలవరం ఎస్ఈకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆయన డీఈని పంపిస్తానని అక్కడే ఉండమని చెప్పారు. అయితే ఇంతలో ఆ ప్రభుత్వ అధికారి కంటే ముందుగానే అక్కడికి ఎమ్మెల్యే అనుచరులు చేరుకున్నారు. వీరు కృష్ణారావు పై దాడి చేసి, కారులో ఎక్కించుకొని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే చింతమనేని కూడా కృష్ణారావు పై దాడి చేశాడు. దాడి అనంతరం కృష్ణ రావు ని తీసుకొచ్చి బయట వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో కృష్ణ రావు పోలీసులను ఆశ్రయించి ఎమ్మెల్యే పై అతని అనుచరులపై కిడ్నాప్ మరియు దాడి చేసినందుకుగాను కేసు పెట్టారు.
చింతమనేని తీరుపై ఎప్పటినుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇసుక మాఫియాను నడపడం అడ్డొచ్చిన అధికారులను కొట్టడం, ప్రజలను కులం పేరుతో దూషించడం, నియోజకవర్గంలో పలువురి మీద దాడి చేయడం లాంటి ఎన్నో విమర్శలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి వీడియో ఆధారాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కానీ చింతమనేని పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు.