కూకట్ పల్లి బరి నుంచి నందమూరి హరికృష్ణ ఏకైక కుమార్తె సుహాసినిని రంగంలోకి దించాలని నిర్ణయించడంపై టీ టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. నందమూరి హరికృష్ణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వస్తారంటూ.. ఇతరుల పేర్లు ఇంత వరకూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చినా… సుహాసిని పేరు మాత్రం బయటకు రాలేదు. ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉన్నారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా..చంద్రబాబు అభ్యర్థిగా ఖరారు చేశారు. మొదటి నుంచి సుహాసిని చంద్రబాబు కుటుంబంతో ముఖ్యంగా అత్త భువనేశ్వరితో సన్నిహితంగా ఉండేవారు. కళ్యాణ్ రామ్ రాజకీయాల్లోకి రాలేనని చెప్పడంతో సుహాసిని ఆసక్తి కనపరిచింది. సుహాసిని నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. హరికృష్ణ కుటుంబం అంతా… సుహాసిని నిర్ణయానికి అంగీకిరంచడంతో.. చంద్రబాబు కూడా మరో ఆలోచన చేయలేదు.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం వెంట ఉందని, ముఖ్యంగా హరికృష్ణ కుటుంబ సభ్యులు తెలుగుదేశంతో ఉన్నారని తెలుగుదేశం నేతలకు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సుహాసిని పోటీతో చెప్పినట్లయింది. దీని వలన తెలుగుదేశానికి నైతికంగా మద్దతు లభించినట్లయింది. శనివారం నామినేషన్ కార్యక్రమం అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుండటంతో అందరూ తప్పని సరిగా వస్తామని చెబుతున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు, మనుమళ్లు, మనవరాళ్లందరూ కూకట్ పల్లిలో ప్రచారం చేయాలని ప్రాధమికంగా నిర్ణయానికొచ్చారు. గత కొద్ది కాలం నుంచి తెలుగుదేశం రాజకీయాలకు దూరంగా ఉంటున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక సోదరి గెలుపు కోసం రంగంలోకి దిగుతారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
కూకట్ పల్లిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి స్థిరపడిన వారు అత్యధికంగా ఉండటం, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండటంతో సుహాసిని విజయం నల్లేరు పై నడకేనని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. అక్కడ నందమూరి వారి ఆడపడుచు రంగంలోకి దిగడం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారం కోసం కూకట్ పల్లిలో తిరగడం వంటి అంశాలు తెలంగాణలో తెలుగుదేశం అభ్యర్ధులందరికీ, ప్రజా కూటమికి కూడా ప్లస్ పాయింట్ అవుతుందని తెలుగుదేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎన్నికలకు కూడా సుహాసిని రంగ ప్రవేశం తెలుగుదేశానికి నైతిక మద్దతు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.