కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రజాసేవ చేయాడనికే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని… ప్రజల కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు మామ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేస్తానని చంద్రబాబు నమ్మారన్నారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని విజ్ఞప్తి చేశారు. మా నాన్న పార్టీకి చాలా సేవ చేశారని గుర్తు చేశారు. తాతయ్య ఎన్టీఆర్, నాన్న హరికృష్ణ, మామయ్య చంద్రబాబు తనకు స్ఫూర్తి అని సుహాసిని ప్రకటించారు. చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టమన్నారు. ప్రముఖ సినీనటులు, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఎన్నికల ప్రచారానికి వచ్చే అంశంపై నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మాట్లాడతానని సుహాసిని స్పష్టం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఎన్టీఆర్ ఆశయాలకోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని నందమూరి రామకృష్ణ అన్నారు. హరికృష్ణ కుమార్తెను అందరూ ఆశీర్వదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
శనివారం కూకట్ పల్లిలో భారీ ర్యాలీతో సుహాసిని నామినేషన్ వేయబోతున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుండటంతో అందరూ తప్పని సరిగా వస్తామని చెబుతున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు, మనుమళ్లు, మనవరాళ్లందరూ కూకట్ పల్లిలో ప్రచారం చేయాలని ప్రాధమికంగా నిర్ణయానికొచ్చారు. గత కొద్ది కాలం నుంచి తెలుగుదేశం రాజకీయాలకు దూరంగా ఉంటున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక సోదరి గెలుపు కోసం రంగంలోకి దిగుతారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
కూకట్ పల్లిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి స్థిరపడిన వారు అత్యధికంగా ఉండటం, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండటంతో సుహాసిని విజయం నల్లేరు పై నడకేనని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. అక్కడ నందమూరి వారి ఆడపడుచు రంగంలోకి దిగడం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రచారం కోసం కూకట్ పల్లిలో తిరగడం వంటి అంశాలు తెలంగాణలో తెలుగుదేశం అభ్యర్ధులందరికీ, ప్రజా కూటమికి కూడా ప్లస్ పాయింట్ అవుతుందని తెలుగుదేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి.