వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… నోరు తెరవడం లేదు. విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి ఘటన తర్వాత.. పదిహేను రోజుల విశ్రాంతి తీసుకుని సోమవారం నుంచి… పాదయాత్ర ప్రారంభించారు. గురువారం వరకూ నడిచారు. శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. నాలుగు రోజుల పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి.. ఒక్క రోజుంటే.. ఒక్క రోజు కూడా నోరు తెరవలేదు. తన వద్దకు వచ్చే వారితో మాట్లాడుతున్నారు కానీ..ఓ బహిరంగసభ ఏర్పాటుచేసి. తన సహజశైలిలో ప్రసంగించడం లేదు. సాధారణంగా పాదయాత్ర ఓ మాదిరి పట్టణానికి లేదా.. మేజర్ గ్రామ పంచాయతీకి చేరినప్పుడు… జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ ఉంటారు. చెప్పిందే చెప్పడం అయినా… చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ.. పాదయాత్రలో ఇప్పుడు నోరు మెదపడం లేదు.
ఓ వైపు తెలుగుదేశం పార్టీ నేతలు.. జగన్మోహన్ రెడ్డి నోరు తెరవకపోవడానికి కారణం ఏమిటని.. టీజ్ చేస్తున్నారు. కోడి కత్తి దాడి ఘటన తర్వాత… అనుకున్నంత రాజకీయ మైలేజ్ రాలేదని.. డిప్రెషన్‌లో ఉన్నారా అన్న విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు.. టీడీపీ నేతలు.. జగన్ సైలెన్స్‌పై విమర్శలు చేస్తూంటే.. . వైసీపీ నేతలు మాత్రం.. తమ వాదన వినిపిస్తున్నారు కానీ.. అసలు జగన్ వెర్షన్ ఏమిటో.. మాత్రం బయటకు తెలియడం లేదు. అయితే.. జగన్ నోరు తెరవకపోవడానికి వైసీపీ వర్గాలు విభిన్నమైన కారణాలు చెబుతున్నాయి. స్టేట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు కాబట్టి… పోలీసుల విచారణను ప్రశ్నిస్తే.. రివర్స్‌లో విమర్శలు వస్తాయని.. జగన్ అనుమానిస్తున్నారంటున్నారు. అదే సమయంలో… కోడికత్తి దాడి పూర్తిగా… చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నందున.. దానికి సంబంధించి ఓ చిన్న ఆధారం కూడా చూపించలేకపోవడంతో… బహిరంగంగా ఆ మాటలు చెప్పడానికి ఆలస్యం చేస్తున్నారంటున్నారు.
కారణాలు ఏవైనా కానీ… పార్టీ వెర్షన్ ను అందరూ వినిపిస్తున్నారు. కానీ అసలు బాధితుడైన జగన్మోహన్ రెడ్డి.. ఈ ఘటనపై తన అభిప్రాయం చెప్పాల్సి ఉంది. అలా చెప్పినప్పుడే… దానికో విలువ ఉంటుంది. ఈ మౌనం ఇలాగే కొనసాగిస్తూ ఉంటే..టీడీపీ నేతలు మరింత టీజ్ చేయడానికి ఉపయోగపడుతుందే కానీ… ప్రజల్లో సానుకూల భావన తీసుకు రావడానికి ఉపయోగపడదు. ఇప్పటికే పాదయాత్ర పోలీసు వలయంలో సాగుతోంది. నడుస్తున్నారనే మాటే కాని… ప్రజల్ని కలిసే అవకాశం దక్కడం లేదు. దానికి తోడు.. బహిరంగసభల్లో.. ప్రసంగాలు కూడా లేకుంటే.. ఇక పాదయాత్ర జరిగినా.. జరగకపోయినా ఒకటేనన్న భావన వైసీపీలో ఉంది.