కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా… నందమూరి సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేకంగా ఎలాంటి ర్యాలీకి టీ టీడీపీ నేతలు ఏర్పాట్లు చేయలేదు. ముహుర్తం ప్రకారం.. నామినేషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ.. కూకట్పల్లి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో.. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తరలి వచ్చారు. నామినేషన్ దాఖలు చేసే ముందు.. తాత, తండ్రి ఆశీస్సులను తీసుకున్నారు. మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుహాసిని వెంట ఆమె మామ చుండ్రు శ్రీహరి, పలువురు కుటుంబసభ్యులు ఉన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ ఘాట్‌లో బాబాయ్ బాలయ్యతో కలిసి సుహాసిని పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
తమ సోదరి రాజకీయ ప్రవేశాన్ని బ్రదర్స్ కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ సమర్థించారు. నందమూరి సుహాసినికి శుభాకాంక్షలు చెబుతూ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ట్వీట్ చేశారు. ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమకు ఎంతో పవిత్రమైనదన్నారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణగారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరుపున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని.. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలి అని నమ్మే కుటుంబం తమదన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతున్న మా సోదరి సుహాసిని గారికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
కూకట్‌పల్లికి సంబంధించి… టీ టీడీపీ నేతలు కీలక బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. బాలకృష్ణ కూకట్‌పల్లితో పాటు.. శేరిలింగంపల్లిపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను… బాలకృష్ణ సిఫార్సుతోనే… భవ్య ఆనందప్రసాద్ దక్కించుకున్నారు. ఈ రెండు చోట్ల గెలుపుపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ద తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఉన్న చోట కూడా బాలకృష్ణ ప్రచారం చేయనున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మాత్రం… విడివిడిగా అయినా సరే… సుహాసిని కోసం ప్రచారం చేసే అవకాశం ఉంది. సుహాసినికి కుటుంబం మద్దతు ఉందని చెప్పడానికైనా… జూనియర్ ఎన్టీఆర్ సహా అందర్నీ… ఒక్క సారి అయినా కూకట్పల్లి ప్రచారంలో పాల్గొనేలా చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.