తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల వైయస్సార్సీపి పార్టీకి చెందిన నేత పై దాడి చేసిన ఘటన తో మరొకసారి చింతమనేని వివాదాలు తెరమీదకు వచ్చాయి. మహిళా అధికారిని కొట్టడం దగ్గర్నుంచి, ఆర్టీసీ ఉద్యోగి మీద చేయి చేసుకోవడం, జనాలను కులం పేరుతో దూషించడం, వృద్ధులను కాలితో తన్నడం లాంటి అనేక వివాదాల్లో చింతమనేని ఇరుక్కుని ఉన్నారు. వీటిలో చాలా సంఘటనలకు వీడియో సాక్షాలు ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ చింతమనేని పై చర్య తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారని ప్రజల్లో ఎప్పటినుంచో అనుమానాలు ఉన్నాయి. అయితే ఇటీవలి ఘటనపై ప్రజల నుంచి చింతమనేని పై వ్యతిరేకత రావడంతో పాటు, అలాంటి ఎమ్మెల్యేని కట్టడి చేయలేక పోతుంది అంటూ టిడిపి ప్రభుత్వం పై అలాగే ముఖ్యమంత్రి పై కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా చింతమనేని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి వార్నింగ్ తో సరిపెట్టేశారు.
చింతమనేని ని ముఖ్యమంత్రి మందలించేశారంటూ తెలుగుదేశం అనుకూల మీడియా లో స్క్రోలింగులు మొదలయ్యాయి. చింతమనేని ప్రవర్తనపై ముఖ్యమంత్రి మండిపడ్డారని, ఎన్నిసార్లు చెప్పినా ఆయన పద్ధతి మార్చుకోవడం లేదని, ఇలాంటి ప్రవర్తనను పార్టీ సహించదని, చానళ్లలో స్క్రోలింగులు మొదలయ్యాయి. అదే సమయంలో పని చేస్తే సరిపోదని పద్ధతిగా కూడా ఉండాలని చంద్రబాబు అన్నట్టుగా స్క్రోలింగ్ ఇస్తూ, చింతమనేని ని చక్కటి పనిమంతుడు గా చిత్రీకరించే విధంగా స్క్రోలింగ్ ఇచ్చారు. అలాగే, ఒక ఎమ్మెల్యే చేసిన తప్పులకు పార్టీ మొత్తం ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వస్తోందని అంటూ పార్టీ మీద కాస్త సానుభూతి కలిగేలా డిజైన్ చేసిన స్క్రోలింగులు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వస్తున్నాయి.
అయితే ఇలాంటి ఉత్తుత్తి వార్నింగు లను మీడియా ద్వారా ఎంతగా ప్రజల్లోకి పంపినప్పటికీ, ప్రజల్లో మాత్రం ఇవి నమ్మకం కలిగిన లేకపోతున్నాయి. చింతమనేనికి ప్రభుత్వం అసెంబ్లీలో చీఫ్ విప్ పదవి ఇచ్చింది. ఎమ్మెల్యేలను క్రమశిక్షణ లో పెట్టే బాధ్యత కలిగిన ఈ పోస్ట్ నుంచి కనీసం తపిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉంటే, చింతమనేని ఆగడాలను చంద్రబాబు సహించడం లేదన్న బలమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లి ఉండేది. కానీ, ఎటువంటి చర్య తీసుకోకుండా కేవలం మీడియాని అడ్డం పెట్టుకొని ఇలా ఉత్తుత్తి వార్నింగ్ లతో చంద్రబాబు కాలయాపన చేయడం ప్రజలకు రుచించడం లేదు.