‘ఎన్టీఆర్’ బయోపిక్ రోజుకో కొత్త కళ సంతరించుకుంటోంది. కథానాయకుడో, నాయికో.. ఎన్టీఆర్ టీమ్‌తో జట్టుకడుతున్నారు. దాంతో స్టార్ల సంఖ్య అలా పెరుగుతూనే ఉంది. తాజాగా `ఎన్టీఆర్` టీమ్‌లో శ్రియ చేరింది. ఈ సినిమాలో శ్రియ నటిస్తోన్న సంగతి తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు ఆమె చేయబోయే పాత్ర ఏమిటన్న విషయంలో క్లూ దొరికింది. ఎన్టీఆర్ ఖ్యాతిని మరింతగా వెలుగొందేలా చేసిన సినిమా.. దాన వీర శూర కర్ణ. ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేయడమే కాకుండా, దర్శకత్వం వహించి – నిర్మాణ బాధ్యతల్నీచూసుకున్నారుఎన్టీఆర్. ఈ బయోపిక్‌లో `దాన వీర శూర కర్ణ` చిత్రం వెనుక జరిగిన ఆసక్తికరమైన సంగతులకు ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో పాటు.. `ఛాంగురే బంగారు రాజా` అనే పాటనీ చూపించబోతున్నారు. దుర్యోధనుడికి డ్యూయెట్ పెట్టడమేంటని విమర్శించిన వాళ్లు సైతం తెరపై ఈ పాటని చూసి మురిసిపోయారు. ఇప్పుడు ఈ పాట మరోసారి `ఎన్టీఆర్` బయోపిక్ ద్వారా చూడబోతున్నాం. పాత పాటలో ఎన్టీఆర్‌తో కలసి ఆడి పాడిన ప్రభ స్థానంలో శ్రియ వచ్చింది. బాలయ్య – శ్రియలపై ఇప్పటికే ఈ పాటని తెరకెక్కించినట్టు సమాచారం అందుతోంది. చెన్నకేశవరెడ్డిలో తొలిసారి బాలయ్య, శ్రియ జట్టుకట్టారు. గౌతమిపుత్ర, పైసా వసూల్లోనూ వీరిద్దరూ కలసి నటించాడు. ఇప్పుడు వరుసగా నాలుగో సినిమాలోనూ బాలయ్య శ్రియకి ఛాన్స్ ఇచ్చేశాడు. మరి ఈ పాటని క్రిష్ ఇంకెంత రసవత్తరంగా తీశాడో చూడాలి.