ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాదు నగరాన్ని పదేళ్లపాటూ విచ్చలవిడిగా వాడుకోవడానికి విభజన చట్టమే వెసులుబాటు కల్పించింది. అయితే ‘మన నేలమీదనుంచే మన పాలన’ అనే అప్రకటిత నినాదానికి ఆచరణ రూపం అన్నట్లుగా చంద్రబాబునాయుడు తనవంతు పరిపాలన యంత్రాంగాన్ని సర్దుకుని బెజవాడకు వెళ్లిపోయారు. వ్యవహారాలు అంతా అక్కడినుంచే నడిపిస్తున్నారు. సెక్రటేరియేట్ కార్యభారం మాత్రం హైదరాబాదు కేంద్రంగా నడుస్తున్నది. ఈ జూన్‌కు తరలించే ఆలోచనలో ఉన్నారు. అయితే సుమారు 3-4 నెలలకు కొన్ని రోజుల పాటూ జరిగే అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో ఆంధ్రా నాయకులు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారా అనిపిస్తోంది. కొన్ని నెలలకు ఒకసారి కొన్ని రోజుల పాటూ జరిగే సమావేశాల కోసం ఏపీలో కొత్త వేదికలను వెతుక్కోవాలని.. కొత్తకొత్తగా అక్కడ నిర్వహించాలని వారు చేస్తున్న ప్రయత్నాలు, ప్రదర్శిస్తున్న ఆరాటం జనానికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీని హైదరాబాదులో భవనంలోనే నిర్వహించుకోవడానికి పదేళ్ల వరకు అవకాశం ఉంది. అయితే ఏపీస్పీకరు దానికి తగ్గట్లుగానే.. విభజన తర్వాత తొలి సమావేశాల సమయంలో.. తెలంగాణ సర్కారుతో దాదాపుగా ఒక పోరాటం నడిపించి మరీ.. తమకు భవనాలు, గదులు కేటాయింపజేసుకున్నారు. అయితే ఆ తర్వాతి సమావేశాలనుంచి ఆయనకు ఈ భవనాల మీద మక్కువపోయింది. అమరావతి ని రాజధానిగా, బెజవాడ- గుంటూరులను తాత్కాలిక రాజధానిగా ఎంపిక చేసినప్పటినుంచి అక్కడ సమావేశాలు తాత్కాలిక ప్రాతిపదికన నిర్వహించాలని ఆయన ఉత్సాహపడుతున్నారు.
నాలుగైదు రోజుల ముచ్చట కోసం కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు? అనే ప్రశ్న వస్తున్నా.. అమరావతి లోనే నిర్వహించాలనే ఆరాటం ఆయనలో కనిపిస్తోంది. శీతాకాల సమావేశాలనే అమరావతిలో తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ నిర్వహించాలని ఆయన దాదాపుగా టెండర్లు కూడా ఓకే చేసే సమయంలో చంద్రబాబు అడ్డుపడ్డారు. అలాగే ఇప్పుడు బడ్జెట్ సమావేశాల విషయంలో కూడా గుంటూరులో నిర్వహించాలనే కోడెల కోరికకు చంద్రబాబు బ్రేకులు వేసేశారు.
గతంలోనే అగ్రిగోల్డ్ గ్రూపునకు చెందిన హాయ్‌ల్యాండ్ నిర్వహించాలని కోడెల ప్రతిపాదించారు, తాజాగా కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించడానికి కూడా ఆలోచన సాగించినట్లు సమాచారం. అయితే ఈ ఏర్పాట్లు అన్నీ భారీ వ్యయంతో కూడుకున్నవి. ఆ దృష్టితోనే చంద్రబాబునాయుడు .. ఈ బడ్జెట్ సమావేశాలను కూడా హైదరాబాదులోనే పెట్టాలని.. వీటిని గుంటూరు లేదా విజయవాడ తీసుకువెళ్లే ఆలోచన వద్దని అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇటీవలి కేబినెట్లోనూ దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరిగినప్పటికీ.. మెజారిటీ మంత్రులు హైదరాబాదులోనే సమావేశాలు నిర్వహించాలనే అభిప్రాయాన్ని చెప్పారని, తద్వారా కోడెల కోరికకు బ్రేకులు పడ్డాయని అనుకుంటున్నారు.