తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్…ఫాంహౌస్లో రాజశ్యామల హోమం ప్రారంభించారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా.. ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉదయం ఏడున్నరకు… నలభై ఎనిమిది మంది ఋత్విక్కులతో ఈ హోమాన్ని ప్రారంభించారు. మొత్తం 120 మంది ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖ స్వరూపానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు రోజుల పాటు ఇది జరగనుంది. “కామ్యసిద్ధి” కోసం నవగ్రహ పాశుపతం, సూర్యనమస్కారాలు, రుద్రక్రమార్చన, రుద్రాభిషేకం, రుద్రహోమం కూడా చేస్తున్నాయి. రేపు మధ్యాహ్నం వరకూ ఈ హోమం జరుగుతుంది. కేసీఆర్ స్వయంగా ఈ హోమంలో పాల్గొంటున్నారు.
కొద్ది రోజుల కిందట.. .దివ్య సాకేతంలో… చినజీయర్ స్వామిని కలిసినప్పుడు.. హోమం నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆదేశం మేరకు ఆయన సన్నిహితులు ఇటీవల స్వరూపానంద జన్మదినోత్సవానికి వెళ్లి, ఫాం హౌస్లో రాజశ్యామల హోమం జరపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన అంగీకరించారు. ఇదే సమయంలో శృంగేరీ ఆస్థాన పండితులు ఫణిశశాంక్ శర్మ, గోపీకృష్ణశర్మ ఆధ్వర్యంలో 72 మంది ఋత్విక్కులు మహారుద్రసహిత చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ హవన కార్యక్రమాల పూర్ణాహుతి సోమవారం మధ్యాహ్నం పూర్తవుతుంది. ఆ తర్వాత ఖమ్మంలో మధ్యాహ్నం 2:30కి జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
యజ్ఞాలు, యాగాలపై కేసీఆర్ కు అమితమైన నమ్మకం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన ఆయుత చండీయాగం చాలా రోజులు హాట్ టాపిక్ ఉంది. పలుమార్లు.. ఆయన చండీయాగాలు చేయించారు. ఇప్పుడు కూడా చేయిస్తున్నారు. అయితే.. ఈ యాగాలు అధికారాన్ని తెచ్చి పెడతాయా.. లేదా అన్నదానిపై.. ఎవరి సందేహాలు వాళ్లకు ఉంటాయి. ఎన్ని విమర్శలు వచ్చినా… తన నమ్మకాల ప్రకారం తాను వెళ్తున్నారు.