వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని తన మీద వస్తున్న ఆరోపణలపై ఈరోజు స్పందించారు. నేను ఇలాగే ఉంటా అంటూ వ్యాఖ్యానించిన చింతమనేని తాను చేస్తున్న మంచి పనులను ఎవరూ గుర్తించడం లేదని వాపోయారు.
విద్యార్థినికి రుణం ఇచ్చే విషయంలో మాజీ సర్పంచ్ తో ఇటీవల గొడవ పడ్డ చింతమనేని ఇప్పుడు ఆ గొడవకు ఫుల్స్టాప్ పెట్టారు. పా మాజీ సర్పంచ్ తో కలిసి ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు ఎమ్మెల్యే చింతమనేని. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నందువల్లే తనకు సమస్యలు తెలుస్తున్నాయని, అందువల్లే ఆ సమస్యల మీద స్పందిస్తున్నారని వ్యాఖ్యానించాడు ఎమ్మెల్యే చింతమనేని. ఒకవేళ తాను చేస్తున్న పనుల వల్ల అధినాయకత్వానికి ఏదైనా బాధ కలిగితే తాను చెప్పుకుంటానని, అంతే తప్ప తన పద్ధతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోనని వ్యాఖ్యానించాడు చింతమనేని. కానీ మిగతా నాయకుల లాగా వందలకోట్లు వేలకోట్లు సంపాదించుకోవడం లేదని, కేవలం పేదవాడికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని కలిగించిన వాడి మీద మాత్రమే దాడి చేస్తున్నానని తనని తాను సమర్థించుకున్నారు చింతమనేని. ఇదే విషయంపై వివాదంలో చింతమనేని కి వ్యతిరేకంగా ఉన్న సర్పంచ్ రంగారావు కూడా చింతమనేని ని సమర్థించుకుంటూ వచ్చారు. చింతమనేని తనకు అన్నలాంటి వాడని, ఆయనతో నాకు ఇబ్బందులు ఏమీ లేవని ఆయన చెప్పుకొచ్చాడు.
అయితే ప్రధాన మీడియాలో ప్రముఖంగా వచ్చిన ఈ న్యూస్ ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్టుగా అర్థమవుతుంది. నిజానికి ఇటీవల వైకాపా పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణారావు పై ఇటీవల చింతమనేని దాడి చేశారు. (https://www.telugu360.com/te/chintamaneni-attacks-ex-sarpanch/). ఆయన చింతమనేని పై కేసులు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు వేరే ఇంకొక మాజీ సర్పంచ్ తో జరిగిన గొడవ విషయంలో వివరణ ఇస్తూ, మాజీ సర్పంచ్ తో చింతమనేనికి ఎటువంటి గొడవలు లేవని ప్రజలకు కన్వే అయ్యేలాగా ఒక న్యూస్ ఐటమ్ క్రియేట్ చేసినట్టుగా అర్థమవుతుంది.
ఏది ఏమైనా తాను ఇలాగే ఉంటానని, తన పద్ధతి మార్చుకోనని చెబుతున్న చింతమనేని పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందిస్తాడు, ఏ చర్య తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.