2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని.. గ్రేటర్ పరిధిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు… ఒంటరిగా పోటీ చేస్తోంది. అన్ని స్థానాలకు అభ్యర్థులకు వెదుక్కోలేని దుస్థితికి చేరింది. ఆ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల్లో అరవై శాతానికిపైగా డమ్మీ అభ్యర్థులే. వారెవరూ ప్రచారం చేయడానికి కూడా.. అంగ, అర్థం బలం లేని వాళ్లే. డిపాజిట్ల సంగతి తర్వాత ముందు ప్రధాన పార్టీల అభ్యర్థులకు.. డమ్మీలుగా.. మారిపోవడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. వ్యక్తిగత బలంతో పోటీ పడేవారు కూడా.. బీజేపీతో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు, అంబర్ పేటలో కిషన్ రెడ్డి, గోషామహల్ రాజాసింగ్ తప్ప… బీజేపీలో ఇంకెవరూ.. వ్యక్తిగతబలంతో అయినా గెలిచే సత్తా ఉన్నవాళ్లు కాదు.
అందుకే టీఆర్ఎస్ నేతలో… ప్రజాకూటమి పార్టీల నేతలో.. టిక్కెట్లు దొరకక తమ వద్దకు వస్తే.. వారిని అభ్యర్థులుగా ప్రకటించేందుకు చాలా రోజులుగా ఎదురు చూస్తోంది. ఇలా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు ఇతర చిన్నాచితకా పార్టీల నుంచి టిక్కెట్ల కోసం వచ్చిన వారందర్నీ కలుపుకుని బీఫామ్స్ ఇచ్చేసింది. తాజా మాజీ ఎమ్మెల్యేలు బాబూమోహన్, బొడిగే శోభ కూడా ఇందులో ఉన్నారు. కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు.. మరికొంత మంది నియోజకవర్గ స్థాయి నేతల్ని కూడా.. బీజేపీ కొన్ని నియోజకవర్గాల్లో … ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకుని టిక్కెట్లు ఇచ్చి..అభ్యర్థుల్ని నిలబెట్టగలిగామని… సర్ది చెప్పుకుంది. ఇప్పుడు ఈ అభ్యర్థుల్ని పెట్టుకుని… కనీసం ఇంతకు ముందు ప్రకటించిన 70 సీట్ల లక్ష్యాన్ని కనీసం గెలుపు కాకపోయినా… డిపాజిట్ల స్థాయి వరకూ వస్తారా లేదా అన్నది బీజేపీ నేతలకే సందేహాస్పదంగా మారింది.
ఇంకా విశేషం ఏమింటే.. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో.. ఇలా ఇతర పార్టీల్లో నిరాదరణకు గురైన నేతలు … బీజేపీ తరపున బీఫామ్ ఇస్తామని .. వెంటపడినా.. తాము బీఎస్పీ తరపునో.. బీఎల్ఎఫ్ అనే కూటమి తరపునో పోటీ చేస్తాం కానీ.. బీజేపీ తరపున మాత్రం చేయనే చేయబోమని ప్రకటించారు. బెల్లంపల్లి నుంచి పోటీ చేయాలని… తెగ ఉత్సాహ పడుతున్న కాకా వెంకటస్వామి కుమారుడు…మాజీ మంత్రి వినోద్… బెల్లంపల్లి నుంచి అన్ని పార్టీల టిక్కెట్లనూ ప్రయత్నించారు. కానీ ఎవరూ ఇవ్వలేదు. బీజేపీ టిక్కెట్ కోసం ప్రయత్నించలేదు. వాళ్లు ఇస్తామన్నా.. కావాలంటే.. తాను బీఎస్పీ తరపున పోటీ చేసుకుంటానని చెప్పి పంపించేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని… ఓ మాదిరి ఓట్లు సాధించింది.. ఈ సారి ఆ మాత్రం ఓట్లు, సీట్లు సాధించకపోతే.. బీజేపీ పరువు గంగలో కలసిపోతుంది. ఎందుకంటే.. గత ఎన్నికల తర్వతా టీడీపీతో పొత్తు ఉండదు.. తాము టీఆర్ఎస్ను ఢీకొట్టే స్థాయిలో ఉన్నామని ఏకపక్షంగా చెప్పుకుని.. ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించుకుంది. నిజానికి అప్పటికి టీడీపీ ఇంకా ఎన్డీఏకు గుడ్ బై చెప్పలేదు కూడా..!