అప్పట్లో త్రివిక్రమ్ మాటలు రాయడానికి ఒక్కో సినిమాకీ ఒక్కో కోటి తీసుకుంటున్నాడంటే అంతా ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో అంత డిమాండ్ ఉండేది. త్రివిక్రమ్ వచ్చిన తరవాతే రచయితలకు పారితోషికాలు బాగా పెరిగాయి. కోన వెంకట్‌లాంటి వాళ్లు సైతం ‘కోట్లు’ అందుకున్నారు. ఇప్పుడో కుర్ర రచయిత పారితోషికం కూడా కోటి రూపాయలని టాక్. తనే… ప్రసన్నకుమార్. జబర్దస్త్‌లో స్కిట్లు రాసిన ప్రసన్న.. ‘సినిమా చూపిస్త మావ’తో రచయిత అయ్యాడు. ఆ సినిమా హిట్టయింది. తనకీ మంచి పేరొచ్చింది. ఆ వెంటనే త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలకూ సంభాషణలు అందించాడు. ఇప్పుడు అతని పారితోషికం కోటి రూపాయలని టాక్. త్రినాథరావు దర్శకుడిగా రూ.4 కోట్లు తీసుకుంటున్నాడట. అందులో కోటి రూపాయలు రచయిత ప్రసన్నకే ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే విషయంలోనూ ప్రసన్న చేయి ఉంటుందని, అందుకే ప్రసన్నకు ఇంత పారితోషికం ఇస్తున్నాడని టాక్. ప్రస్తుతం వెంకటేష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు త్రినాథరావు. దానికీ.. ప్రసన్నే కథ, మాటలు అందిస్తున్నాడు.