నందమూరి సుహాసిని. ఈ పేరు కొద్ది రోజుల క్రితం వరకు చాలా మందికి తెలియదు. కానీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాజకీయ చతురత ఉపయోగించి, హరికృష్ణ కుమార్తె అయిన నందమూరి సుహాసిని కూకట్పల్లి స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టారు. గత ఎన్నికల్లో కూడా ఈ స్థానం టిడిపి గెలుచుకుంది కానీ ఆ పార్టీ అభ్యర్థి ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మరి ఇప్పుడు నందమూరి సుహాసిని విజయం సాధించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అన్న చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తోంది.
కూకట్పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అభిమానులు బాగానే ఉన్నప్పటికీ, స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుల కోసం ఓటర్లు ఎప్పుడు చూస్తూ ఉంటారు. గతంలో ఈ స్థానం నుంచి పోటీ పడాలని భావించిన పెద్దిరెడ్డి, మందాడి లు స్థానికంగా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే ఆఫీస్ ప్రారంభించి ఉన్నారు. కానీ నందమూరి సుహాసిని కి ఈ అంశం ఇప్పటిదాకా అయితే ప్రతికూలం గానే ఉంది. ఆమె ఎక్కడో జూబ్లీహిల్స్ లో ఉంటుందని ఇక్కడ ఓటర్లు భావిస్తున్నారు.
పైగా గతంలో ఇక్కడ నుండి గెలిచిన మాధవరం కృష్ణారావు, చాలాకాలం క్రిందటే ప్రచారం ప్రారంభించి ఉన్నారు.కూకట్పల్లి నియోజకవర్గం లో ఆంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు, స్థానిక తెలంగాణ ప్రజలు ఉండే ప్రాంతాలలో కూడా ఆయన గట్టిగా ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నాలుగేళ్ల సమయంలో ఆయన ఈ ప్రాంత సమస్యలను అవలోకన చేసుకుని ఉన్నారు. ఇలాంటి అభ్యర్థిని ఢీకొట్టి గెలవడం సుహాసిని కి అంత సులభమైన విషయం ఏమి కాదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉంటాడు అని పేరు నియోజకవర్గంలో ఉంది.
మరి రాబోయే మూడు వారాలు సుహాసిని ఏ విధంగా ప్రచారం చేస్తుంది, ఎంత మేరకు కూకట్పల్లిఓటర్లను ఆకట్టుకుంటుంది అన్న అంశంపై ఆమె గెలుపు ఆధారపడి ఉంది.