జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. జనసేన తరపున తెలంగాణ ఎన్నికల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల గడువు ముగిసింది కాబట్టి… ఇక దాఖలయ్యే అవకాశం లేదు. సోషల్ మీడియాలో రెండు, మూడు రోజులుగా.. జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది అంతా అవాస్తవమేనని తేలింది. అయితే.. తెలంగాణ ఎన్నికల్లో పోటీపై పవన్ కల్యాణ్ ఏమీ తేల్చి చెప్పలేదు. నామినేషన్ల గడువు ముగిసే వరకూ కూడా పోటీ చేయడం లేదన్న అధికారిక ప్రకటన చేయలేదు. మందస్తు ఎన్నికల కారణంగా.. సిద్ధం కాలేకపోయామని… చెప్పారు. అయితే.. పోటీ విషయంలో మాత్రం చర్చిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ చర్చలు పూర్తి కాక ముందే నామినేషన్ల గడువు ముగిసిపోయింది.
గతంలో పవన్ కల్యాణ్.. తాము పోటీ చేయకపోయినా… ఇతర పార్టీలకు మద్దకు ప్రకటిస్తామన్నారు. ఈ విషయంలో.. పవన్ కల్యాణ్ ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ రద్దయిన తర్వాత.. సీపీఎం నేతృత్వంలోని బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్… బీఎల్ఎఫ్ .. జనసేనను.. తమ కూటమిలో చేర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం .. పవన్ తో భేటీకి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు. చివరికి పవన్ కల్యాణ్ ఏ విషయంమూ వీరభద్రానికి చెప్పలేదు. దాంతో ఆ ఎపిసోడ్ అలా ముగిసిపోయింది.ఇప్పుడు తమ కూటమికి మద్దతు అయినా ఇస్తారేమోనని.. బీఎల్ఎఫ్ నాయకత్వం ఆశగా ఉంది.
మరో వైపు పవన్ కల్యాణ్ కు.. తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం జాతీయ మీడియాతో మాట్లాడినప్పుడు… టీఆర్ఎస్ సర్కారుకు.. పదికి ఆరు మార్కులు ఇచ్చారు. టీఆర్ఎస్ పాలన బాగుందని కితాబునిచ్చారు. దాంతో ఆయన టీఆర్ఎస్ కుమద్దతు ప్రకటించవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే.. టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కు అది మైనస్ అవుతుందని జసేన వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పవన్ మద్దతు ప్రకటిస్తే.. ఈ రెండింటింలో ఒకరికి మద్దతు ప్రకటిస్తారు కానీ… కాంగ్రెస్, టీడీపీలు ఉన్న మహాకూటమికి, బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై పవన్ కల్యాణ్ 27వ తేదీన నిర్ణయం తీసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి