రాజకీయల కోసం సినిమాలకు దూరమయ్యాడు పవన్ కల్యాణ్. బహిరంగ వేదికలపై కూడా `మీ సమస్యల్ని చూసి తట్టుకోలేకే… సినిమాలు వదిలేసి మీ మధ్యకు వచ్చాను` అని చెవులు చిల్లులు పడేల స్పీచులు ఇస్తున్నాడు. పవన్ అభిమానులు, చిత్రసీమ కూడా 2019 అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ పవన్ కల్యాణ్ సినిమాలు చేయడన్న అభిప్రాయానికి వచ్చేశారు. అయితే పవన్ ఇప్పుడు ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని టాక్. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని, తెర వెనుక తతంగం అంతా ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నారని సమాచారం.
అయితే ఈ సినిమాలో మరో కథానాయకుడు ఉంటాడట. పవన్ ఓ కీలక పాత్ర పోషిస్తాడని, ద్వితీయార్థంలో పవన్ రోల్ కీలకం అవుతుందని, ఓ రకంగా పవనే ఇందులో హీరో అని తెలుస్తోంది. ఇదో పొలిటికల్ డ్రామా అని, రాజకీయంగా ఈ చిత్రం పవన్‌కి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, పవన్ కూడా ఇందుకు అంగీకరించాడని, స్క్రిప్టు సిద్ధమైందని, ఈ చిత్రంలో మరో కథానాయకుడిగా మెగా హీరోనే నటించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మరోవైపు మైత్రీ మూవీస్ కూడ పవన్ రాకకోసం ఎదురుచూస్తోంది. పవన్ కి ఇది వరకే మైత్రీ అడ్వాన్స్ ఇచ్చింది. మరి ఈ సినిమాని మైత్రీ సౌజన్యంతో పూర్తి చేస్తారా, లేదంటే రామ్ తాళ్లూరినే సోలోగా నిర్మిస్తారా.. అనేది చూడాలి. `ప్రజా సేవ కోసమే సినిమాలు మానేశా` అని చెబుతున్న పవన్… తన నిర్ణయాన్ని మార్చుకోవడం నిజంగా షాకింగే అయినా… పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఇంతకంటే గుడ్ న్యూస్ మరోటి ఉండదు.