కోల్‌కతా: జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొనేందుకు ‘మహాకూటమి’ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు. రాష్ట్ర సచివాలయం నబన్నా వద్ద చంద్రబాబుకు మమతా బెనర్జీ సాదర స్వాగతం పలికారు.
విపక్షాలతో కూడిన ‘మెగా ఫ్రెంట్’ ఏర్పాటు విధివిధానాలు, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై ఈనెల 22న న్యూఢిల్లీలో ‘గ్రాండ్ మీటింగ్’కు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీని చంద్రబాబు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీబీఐకి ఏపీలో సాధారణ అనుమతిని చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం, మమతా బెనర్జీ సైతం చంద్రబాబు బాటలోనే తామూ వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉభయ నేతలు సమావేశం కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.