వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భాజపా వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి నడిపించే ప్రయత్నాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఆయన కోల్ కతా వెళ్లి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ… తమ భేటీలో మోడీ సర్కారు వైఫల్యాల గురించి ప్రధానంగా చర్చించామన్నారు. దీంతోపాటు ఇతర రాజకీయ అంశాలపై కూడా మాట్లాడుకున్నాం అన్నారు. మహా కూటమి ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఈ నెల 22న ఒక సమావేశం ఏర్పాటు చేద్దామనుకున్నామనీ, శీతాకాల సమావేశాలకంటే ముందుగానే ఈ భేటీ ఉంటే మంచిదని మొదట అనుకున్నామనీ, అయితే ఇప్పుడా మీటింగ్ ని వాయిదా వేసుకున్నామని చంద్రబాబు చెప్పారు.
పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి, మరో తేదీన ఈ సమావేశం ఉంటుందన్నారు ఏపీ సీఎం. ఆ తేదీ ఏంటనేది త్వరలోనే నిర్ణయించి ప్రకటిస్తామని చెప్పారు. త్వరలో ఏర్పడబోయే కూటమి అత్యంత శక్తివంతంగా ఉంటుందనీ, సమర్థమైన పాలన అందిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. భాజపా పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయనీ, దేశంలోని సీనియర్ నాయకులుగా ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు చంద్రబాబు.
ఆ తరువాత, మమతా బెనర్జీ మాట్లాడుతూ… భాజపా నుంచి దేశాన్ని కాపాడుకోవాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించామన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు తాము అండగా ఉన్నామనీ, కర్ణాటక విషయంలో కూడా మద్దతు నిలిచామన్నారు. త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్న సమావేశం వాయిదా వేసుకున్నామనీ, అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే సమావేశం తేదీని ప్రకటిస్తామని మమతా చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేలోపుగానే సమావేశం ఉంటే అవకాశాలున్నాయన్నారు.