కొన్ని పాత్రలకు ప్రత్యామ్నాయం ఉండదు. సూర్యకాంతం, ఎస్వీఆర్.. ఈ పాత్రల్ని మళ్లీ సృష్టించలేం. అందుకే `ఎన్టీఆర్` బయోపిక్ సూరేకాంతం లేకుండానే పూర్తయిపోతోంది. సూర్యకాంతంలా.. ఎస్వీఆర్ కూడా ఉండరేమో అనుకుంటున్న తరుణంలో క్రిష్ బృందానికి ఓ ఎస్వీఆర్ దొరికేశాడు. `ఎన్టీఆర్` బయోపిక్‌లో ఎస్వీఆర్‌కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలున్నాయి. ఇందుకోసం చాలామంది నటుల పేర్లు పరిశీలించాడు క్రిష్. ‘మహానటి’లో ఎస్వీఆర్ గా మోహన్ బాబు నటించారు. ఓ దశలో మోహన్ బాబు పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. కానీ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం క్రిష్ ఎదురుచూడడం మొదలెట్టారు. ఆ ప్రయత్నం ఫలించింది. ఎస్వీఆర్ పాత్ర కోసం ఓ థియేటర్ ఆర్టిస్టుని వెదికిపట్టుకున్నారు క్రిష్. అతను అచ్చుగుద్దినట్టు ఎస్వీఆర్లానే ఉన్నాడట. ఈ సినిమాలో ఇంకొన్ని కీలక పాత్రలలో నాటక రంగ ప్రముఖులు కనిపిస్తారని తెలుస్తోంది. కాంతారావు పాత్రనీ అలానే సెట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. అక్కడ పాతాళ భైరవికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. జనవరి 9న ఎన్టీఆర్ – కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.