తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన అనేది ఈ మధ్య తీవ్రమైన చర్చనీయాంశంగా నిలుస్తూ వచ్చింది. ఒక్కో టిక్కెట్ కి కనీసం ఐదారుగురు పోటీ పడిన పరిస్థితి, ఇంకోపక్క సీనియర్ల ఒత్తిళ్లు, వారసులకు సీట్లు కావాలంటూ ప్రయత్నాలు, మరోపక్క ప్రజా కూటమిలో భాగంగా భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాల్సిన సీట్లు… ఆ క్రమంలో టిక్కెట్లు దక్కనివారి అసంతృప్తులు… వీటన్నింటినీ తట్టుకుంటూ, పార్టీకి తక్కువ డామేజ్ తోనే సీట్ల ప్రకటన అనే ప్రక్రియను టీ కాంగ్రెస్ పూర్తి చేసిందని చెప్పొచ్చు. అయితే, ప్రస్తుతం స్నేహపూర్వక పోటీ పేరుతో ఓ పంచాయితీ ఉందిగానీ… నామినేషన్ల ఉపసంహరణ నాటికి అది కూడా దాదాపు పరిష్కృతం అవుతుందనే ధీమా పార్టీ వర్గాల్లో ఉంది.
ఈ మొత్తం ప్రహసనంలో కీలకమైన పరిణామం ఏంటంటే.. కొంతమంది సీనియర్లకు సీట్లు దక్కకపోవడం! ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదే విమర్శలు వచ్చాయి. అయితే, చేతికి మట్టి అంటకుండా ఇలాంటి అంశాలపై ఆయన చాకచక్యంగానే వ్యవహరించారనాలి. పటాన్ చేరు స్థానాన్ని దామోదర్ రాజనర్సింహ తన అనుచరుడి కోసం బలంగా అడుతూ వచ్చారు. అయితే, ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటనను చివరి వరకూ వాయిదా వేస్తూ నాన్చారు ఉత్తమ్. అయితే, పటాన్ చేరు టీడీపీకి అన్నారు మొదట. అలాగని రాజ నర్సింహకు నో చెప్పకుండా… టీడీపీకి ఎస్ చెప్పకుండా చివరి నిమిషంలో బీఫామ్ ఇచ్చేశారు. ఇంకోపక్క టీడీపీ కూడా తమ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చుకుంటారు కదా! సో.. ఆ పంచాయితీ ఇక వారి మధ్య అన్నట్టుగా, తన పరిధిలో లేని అంశంగా మారింది. ఇక, మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి విషయంలోనూ ఇలానే వ్యవహరించారు. ఆయన ఏకంగా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ తో చర్చించాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు.
సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పరిస్థితీ అంతే! పొన్నాలకీ కోదండరామ్ కి లింక్ పెట్టేసి… ఎటూ తేల్చకపోవడంతో పొన్నాల స్వయంగా ఢిల్లీ వెళ్లి అధిష్టానంతోపాటు, ఆఘమేఘాల మీద ఆయనే కోదండరామ్ తో చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి… ఇది ఉత్తమ్ పూనుకుంటే సెట్ చేయదగ్గ వ్యవహారమే అయినా, ఎవ్వరితోనూ సంబంధాలు చెడకూడదన్న ఉద్దేశంతో తప్పించుకున్నారు అనుకోవచ్చు! రాజేంద్రనగర్ సీటు విషయంలో.. తాను కూడా రేసులో ఉన్నానని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించేసరికి… అక్కడ టీడీపీకి ఇవ్వడం పక్కా అనే అంశాన్నే బలంగా తెరమీదికి తెచ్చారు. ఇలా.. సీనియర్ల విషయంలో కొంత చాకచక్యంగా వ్యవహరించి, తనపై పూర్తి వ్యతిరేకత పడేందుకు ఆస్కారం ఇవ్వకుండా వ్యవహారం నడించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఎన్నికల తరువాత ఈ సీనియర్ల స్పందన ఎలా ఉంటుందో మరి.